మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 24, 2020 , 01:57:04

వైభవంగా రథోత్సవం

వైభవంగా రథోత్సవం
  • మేళ్లచెర్వులోని శంభులింగేశ్వరస్వామి
  • బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం
  • రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.
  • పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా మంగళ
  • వాయిద్యాలు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల
  • మధ్య స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు.

మేళ్లచెర్వు : మహాశివరాత్రి సందర్భంగా మేళ్లచెర్వులో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా  ఆదివారం రథోత్సవాన్ని అంగరంగ  వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట రథాంగపూజ, రథాంగహోమం, బలిహరణ తదితర పూజలను అర్చకులు కొంకపాక రాధాకృష్ణమూర్తి, విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ శాస్ర్తోక్తంగా నిర్వహించారు.  శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఎత్తయిన రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. మంగళ వాయిద్యాలతో, వేద బ్రాహ్మణుల మంత్రాల నడుమ రథయాత్ర సాగింది. అంతకు ముందు ఉదయం అభిషేకాలు, అర్చనలు జరిపారు. దేవాదాయశాఖ మంత్రి సతీమణి విజయలక్ష్మి ఆలయంలో అభిషేకం చేసి అనంతరం రథోత్సవ పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తి సిమెంట్స్‌ వీపీ శీనయ్య దంపతులు, సర్పంచ్‌ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి,  ఆలయ  మేనేజర్‌ సత్యనారాయణ,  అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బోగాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


విశ్వశాంతి యాగంలో దేవాదాయశాఖ మంత్రి సతీమణి ప్రత్యేక పూజలు.. 

శివరాత్రి పర్వదిన సందర్భంగా విశ్వమానవ కల్యాణం కోసం కొంకపాక రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  మహారుద్ర యాగ సహిత శత చండీ విశ్వశాంతి మహాయాగం మూడో రోజు కూడా శాస్ర్తోక్తంగా సాగింది.  దేవాదాయ శాఖ మంత్రి సతీమణి అల్లోల విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగంలో పాల్గొని చండీమాత ఆశీస్సులు అందుకున్నారు. అర్చకులు ఆమెకు యాగ ప్రసాదాన్ని అందజేశారు. 


 ఉత్సాహంగా ఎద్దుల పందేలు, కబడ్డీపోటీలు.. 

మహా శివరాత్రి సందర్భంగా మేళ్లచెర్వులో నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు  ఆదివారం రెండో రోజూ ఉత్సాహంగా సాగాయి. నాలుగు పళ్ల విభాగంలో జరిగిన పోటీలను అతిథులు ప్రారంభించగా ఉత్సాహంగా సాగాయి. ఆదివారం రాత్రి జరిగిన పోటీల్లో  ప్రథమబహుమతిని గుంటూరు జిల్లా యతుకుమల్లికి చెందిన గిత్తలు, ద్వితీయ బహుమతిని  గుంటూరు జిల్లా వేటపాలెంకు చెందిన శిరీషచౌదరి, శివకృష్ణచౌదరి గిత్తలు, తృతీయ బహుమతిని లేళ్ల జ్ఞానేందర్‌, శివకృష్ణచౌదరి గిత్తలు, నాలుగో బహుమతిని సంయుక్తంగా పోతినేని అక్షిత్‌చౌదరి, తక్కెళ్లపాడుకు చెందిన మేరువ శ్రీనివాసరెడ్డి గిత్తలు, ఐదోబహుమతిని గుంటూరుకు చెందిన పిడపర్తి శ్రీనివాసరెడ్డి గిత్తలు, ఆరో బహుమతిని గుంటూరు జిల్లా పెదగార్లపాడుకు చెందిన రబ్బాని గిత్తలు, ఏడో బహుమతిని హుజూర్‌నగర్‌కు చెందిన జక్కుల వెంకటేశ్వర్లు, గాదె ఇన్నారెడ్డి గిత్తలు సంయుక్తంగా గెలుచుకున్నాయి. మరోవైపు   ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు ఉత్సాహ భరితంగా సాగుతున్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు భారీగా తరలి వచ్చారు. 


logo