శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 22, 2020 , 04:51:31

పంచాయతీలకు నిధులు విడుదల

పంచాయతీలకు నిధులు విడుదల

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నెలనెలా రూ.కోట్లు గ్రామ పంచాయతీలకు విడుదలవుతుండగా వాటిని పల్లె ప్రగతితోపాటు ట్రాక్టర్ల కొనుగోలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

  • 475 పంచాయతీలకు రూ. 13.61 కోట్లు
  • 6దఫాలు కలిపి రూ. 82.10 కోట్లు విడుదల

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నెలనెలా రూ.కోట్లు గ్రామ పంచాయతీలకు విడుదలవుతుండగా వాటిని పల్లె ప్రగతితోపాటు ట్రాక్టర్ల కొనుగోలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటికే 5 విడుతలుగా రూ. 68.48కోట్లు విడుదల కాగా 6విడుతలో భాగంగా జిల్లాకు రూ. 13.61 కోట్లు వచ్చాయి. వీటిని జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. వచ్చిన నిధుల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 12,16,64,000, స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు రూ.1,44,86,600 ఉన్నాయి. కొద్దిరోజుల్లో ఈ నిధులు పంచాయతీ ఖాతాల్లో జమకానున్నాయి.  


సూర్యాపేట, నమస్తేతెలంగాణ : దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామాలుగా తెలంగాణ గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధుల విడుదల చేస్తున్నది. ఐదు నెలలుగా నిధులు విడుదల చేస్తూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ వస్తున్నది. సెప్టెంబర్‌ నుంచి జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు ఈ నిధులను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరిలో రూ.13,61,50,600 విడుదల చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. వచ్చిన నిధుల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.12,16,64,000, స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు రూ. 1,44,86,600 నిధులు ఉన్నాయి. ఈ నిధులను జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు 2011 జనాభా ప్రకారం 8,21,690 మంది చొప్పున కేటాయిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పంచాయతీ ఎన్నికల సమయంలో తయారు చేసిన నూతన తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం-2018 ప్రకారం గ్రామాల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది. ప్రతినెలా గ్రామ పంచాయతీల్లో ఏయే పనులు చేయాలి, పనుల ప్రాధాన్యతలను గుర్తించడం, తదితర ప్రణాళికలను అన్ని పంచాయతీల్లో తయారు చేసి ఏకగ్రీవంగా తీర్మానాలు చేపడుతున్నారు. 


అనంతరం పల్లె ప్రణాళికలకు విధించే గడువు ప్రకారం క్షేత్రస్థాయిలో పనులు అమలు చేస్తున్నారు. దీంతో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు దఫాలుగా పల్లె ప్రగతి నిర్వహించిన ప్రభుత్వం గ్రామాల్లో ఉండే అనేక సమస్యలను రూపుమాపింది. పారిశుధ్య నిర్వహణతోపాటు అనేక పనులు చేపట్టిన ప్రభుత్వం గ్రామాల్లో ట్రాక్టర్ల కొనుగోలు చేసింది. డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికలు, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం వంటివి చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు గత ఐదు నెలలుగా జిల్లాకు రూ. 68,48,52,100 నిధులు విడుదల కాగా 6వ విడతలో భాగంగా ఈ నెల రూ. 13,61,50,600 విడుదల చేసింది. ఇప్పటి వరకు రూ. 82.10 కోట్లు గ్రామాల అభివృద్ధి కోసం విడుదల చేసింది. మరో వారం రోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. 


logo