సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 20, 2020 , 01:13:51

సర్వే లోపం.. రైతులకు శాపం

సర్వే లోపం.. రైతులకు శాపం


సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వ్యవసాయశాఖ చేపట్టే పంటల సర్వేలో నెలకొన్న లోపాలు రైతులపాలిట శాపాలుగా మారుతున్నాయి. వానాకాలం, యాసంగి పంటలకు ముందు రైతు సమగ్ర సమాచార సేకరణ చేపట్టాల్సి ఉండగా ఈ తంతు తూతూమంత్రంగా కొనసాగుతోంది. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సర్వే చేసే ఏఈవోలు కార్యాలయాల్లో కూర్చుని సర్వే చేశారో లేక ఎక్కడ పడితే అక్కడే ట్యాబ్‌లలో ఇష్టారాజ్యంగా రిపోర్టులను అప్‌లోడ్‌ చేశారో తెలియదు కాని ఏఈవోలు చేసిన సర్వే తప్పుల తడకగా ఉంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు కందులు తెచ్చిన రైతుల పేర్లు ఆన్‌లైన్లో లేవంటూ మార్క్‌ఫెడ్‌ అధికారులు కొనుగోలుకు నిరాకరిస్తుండడంతో రెండు రోజులుగా ఆందోళనలకు దిగుతున్నారు. 


సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 6,677 హెక్టార్లలో సుమారు 13 వేల మంది రైతులు కంది సాగుచేయగా దాదాపు 1,08,000 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. పదిహేను రోజులుగా జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లకు రైతులు కందులు తీసుకొస్తున్నారు. వీటిలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో 15 రోజుల్లో సుమారు 820 క్వింటాళ్లు ట్రేడర్లు కొనుగోలుచేయగా తిరుమలగిరి మార్కెట్‌లో 400 క్వింటాళ్లకుపైనే కొనుగోలు చేశారు. సోమవారు మార్క్‌ఫెడ్‌ కేంద్రాలు ప్రారంభం కాగా సోమ, మంగళవారాల్లో సూర్యాపేట మార్కెట్‌కు 110 మంది రైతులు కందులు తీసుకురాగా.. 61 మంది రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో లేవని కొనుగోలు చేయలేదు. జిల్లాలోని 13 వేల మంది రైతుల్లో దాదాపు 6 వేలకుపైనే పేర్లు ఆన్‌లైన్‌లో లేకపోవచ్చని ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది. అటు ఏం చేయాలో తెలియక అధికారులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు.


logo