శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Feb 19, 2020 , 02:08:44

ఇక పట్టణాల్లో ప్రగతి పరుగులు

ఇక పట్టణాల్లో ప్రగతి పరుగులు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతిని సైతం ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో నిర్వహించిన రాష్ట్రస్థాయి మున్సిపల్‌ సదస్సులో సీఎం కేసీఆర్‌ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు ప్రతి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి నిర్వహించాలని.. అంతకు ముందే వార్డుల్లో సమస్యలు గుర్తించాలని సూచించారు. 10 రోజుల కార్యాచరణలో భాగంగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపైన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అధికారులు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. పట్టణాలు, వార్డుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలని.. దాని అమలు కోసం కౌన్సిలర్లు, చైర్మన్లు, కమిషనర్లతోపాటు అధికారులు, వార్డు కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రజలను సైతం భాగస్వామ్యులుగా చేయాలని సూచించారు.

ప్రతి వార్డుకు ప్రత్యేకాధికారి.. 

చెత్తకు పర్యాయపదంగా మారిన మున్సిపాలిటీలను దేశంలోని ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలిపేలా కృషి చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రతి వార్డుకూ శాశ్వత ప్రత్యేకాధికారిని నియమించాలని చెప్పారు. తమ తమ పట్టణాలను ఆదర్శంగా తీర్చి దిద్దే బాధ్యతను ఆయా పట్టణాల మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లదేనని అన్నారు. పచ్చదనం-పరిశుభ్రతతోపాటు చెత్త సేకరణ వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ కార్యక్రమం చేపట్టాలని సీఎం సూచించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ వార్డుల అభివృద్ధి కోసం ప్రతి వార్డులో నాలుగు ప్రజా సంఘాలను ఏర్పాటు చేసే పనికి ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధికారులు శ్రీకారం చుట్టారు. మహిళలు, యువకులు, వయో వృద్ధులు, సాధారణ పౌరులుగా ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులతో మొత్తం 4 కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కమిటీల సలహాలు, సూచనలతో పట్టణ ప్రగతి ప్రారంభానికి ముందే వార్డు అభివృద్ధి ప్రణాళిక రూపొందించ నున్నారు. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు ప్రతి వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం విస్తృతంగా చేపట్టనున్నారు. 


logo