సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 19, 2020 , 02:06:15

నేడు పంచాయతీరాజ్‌ సమ్మేళనం

నేడు పంచాయతీరాజ్‌ సమ్మేళనం

నల్లగొండ, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది పర్చాలనే ఉద్దేశంతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచి రెగ్యులర్‌గా కొనసాగించాలనే ఆలోచనతో నేడు జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బీట్‌ మార్కెట్‌లో ఈ కార్యక్రమం జరుగనుండగా దీనికి రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు రెండు దఫాలుగా పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించగా ఆ ప్రగతిలోని ప్రధాన అంశాలను తీసుకుని రెగ్యులర్‌గా నిర్వహించేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించనున్నారు. 

పల్లె ప్రగతిలో ప్రధాన అంశాలపై దృష్టి

రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5నెలలుగా పల్లెల అభివృద్ధి కోసం నెల వారీగా రూ.20కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 844 గ్రామ పంచాయతీలకు ఈ నిధుల విడుదల జరుగుతుండగా ఇక జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాలకు సైతం కేటాయించనున్నారు. ప్రధానంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నికైన నేపథ్యంలో వారందర్ని బాధ్యులను చేసి పల్లెల అభివృద్ధ్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఇప్పటికే రెండు దఫాలుగా ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం చేపట్టిన సర్కార్‌ ఆ ప్రణాళికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించనుంది. అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చడంతో పాటు పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచినందున వారితో రెగ్యులర్‌గా చెత్త సేకరణ చేయనున్నారు. అంతేగాక నర్సరీల ఏర్పాటు మొక్కల నాటింపులో భాగంగా హరితహారం అమలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణం, వైకుంఠధామాల నిర్మాణం, కంపోస్టు షెడ్లు, ఇంకుడు గుంతలు, ఇతర కార్యక్రమాలు రెగ్యులర్‌గా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

అవగాహన కోసమే సమ్మేళనం

పల్లె ప్రగతి కార్యక్రమం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నప్పటికి ప్రధానంగా అందులో సర్పంచ్‌లే భాగస్వాములవుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రాదేశిక నియోజక వర్గాలకు సైతం కేటాయించనున్న నేపథ్యంలో ఇక ఎంపీటీసీలు, జడ్పీటీసీలను సైతం బాధ్యులను చేస్తూ ప్రగతి అంశాలపై అవగాహన పర్చనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేడు జిల్లా కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇక నుంచి రెగ్యులర్‌గా గ్రామాల్లో ప్రగతి ప్రణాళికలు అమలు చేసేందుకు నేడు జిల్లా యంత్రాంగంతో పాటు మంత్రి, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో వ్యవహరించనున్నారు. 


logo