గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Feb 19, 2020 , 02:02:22

కంది రైతుల ఆందోళన

కంది రైతుల ఆందోళన

సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కంది రైతుల ఆందోళన రెండోరోజు కొనసాగింది. వ్యవసాయాధికారులు అందించిన ధ్రువీకరణ పత్రం ప్రామాణికంగా కొనుగోలు చేయాలనే నిబంధన, ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే కందులు కొనుగోలు చేస్తామని వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌ అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు కందులు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మార్కెట్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నిర్వహించారు. అంతటితో ఆగక మార్కెట్‌ కార్యదర్శి గదిని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు రంగంలోకి దిగి రైతులను నిలువరించి అక్కడి నుంచి దూరంగా   తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిర్మయి, మార్క్‌ఫెడ్‌ ఉమ్మడి జిల్లా అధికారి సునీత రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం, అధికారులు అందించిన ఆన్‌లైన్‌ వివరాల ప్రకారమే కందులను కొనుగోలు చేస్తున్నామని రైతులకు తెలిపారు. ఆన్‌లైన్‌ నమోదుకు తలెత్తున్న సమస్యలను పరిష్కరించేందుకు రెండురోజుల సమయం పడుతుందని అప్పటివరకు వేచిచూడాలని కోరారు. రైతులు నష్టపోకుండా అన్నిచర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో వారు కాస్త శాంతించారు.

      కందుల పరిశీలన..

మార్కెట్‌కు 110మంది రైతులు కందులను తీసుకురాగా కేవలం 10 మంది రైతుల పేర్లు మాత్రమే నమోదై ఉన్నాయి. రైతుల ఆందోళన అనంతరం మార్కెట్‌కు చేరుకున్న అధికారులు నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో నమోదైన వివరాల ప్రకారం రైతుల కందులను పరిశీలించారు. కానీ తేమశాతం ఎక్కువగా ఉండటంతో వాటిని మరోరోజు కొనుగోలు చేస్తామని వారికి తెలిపారు.


logo