గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Feb 19, 2020 , 02:00:48

భూ సమస్యలపై పరిశీలన చేసి పరిష్కరించాలి

భూ సమస్యలపై పరిశీలన చేసి పరిష్కరించాలి

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, రెవెన్యూశాఖలో భాగంగా భూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి రెండు వారాల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ రెవిన్యూ అదికారులకు సూచించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, తాసిల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అన్ని మండలాల్లోని రెవెన్యూ సమస్యలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్రజావాణి సమస్యలతోపాటు ఇతర ఫిర్యాదులపైన సమీక్షించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రదానంగా గ్రామాల్లో భూ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై దృష్టి సారించాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ప్రజల మధ్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో పెండింగ్‌ లేకుండా చూడాలని డిజిటల్‌ సంతకాలు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని మ్యూటేషన్స్‌, నాన్‌ డీఎస్‌ఖాతాలు, సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పరిష్కరించలేని సమస్యలపై సంబంధిత ఫిర్యాదుదారులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. పల్లె ప్రగతిలో నిర్వహిస్తున్న వైకుంఠధామం, డంపింగ్‌యార్డుల స్థలాలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, లింగ్యానాయక్‌, రోహిత్‌సింగ్‌తోపాటు ఆయా మండలాల తాసీల్దార్లు పాల్గొన్నారు.


logo