శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 17, 2020 , 01:42:49

గులాబీ విజయ భేరి

గులాబీ విజయ భేరి
సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికలు జరుగుతున్నా గులాబీ పార్టీదే విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా జిల్లాలో 46 పీఏసీఎస్‌లలో ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి మరోమారు టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజలకు ప్రధానంగా రైతాంగానికి ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో చాటుకున్నారు. మొత్తం 46 స్థానాలకుగాను మఠంపల్లి, రాయనిగూడెం పీఏసీఎస్‌లలో కోరం లేకపోవడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. మిగిలిన 44 స్థానాల్లో 40 చైర్మన్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ మద్దతు దారులు దక్కించుకోగా 3 మాత్రం కాంగ్రెస్‌ కూటమి గెలవగా, ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి చైర్మన్‌ అయ్యారు. కాంగ్రెస్‌ గెలిచిన మూడు స్థానాల్లో కూడా కొక్కిరేణిలో కాంగ్రెస్‌, సీపీఎం పొత్తులు ఉండగా కాపుగల్లులో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తులు కుదర్చుకున్నారు. మరోటి మాత్రం కాంగ్రెస్‌ గెలుచుకుంది. 


ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా జిల్లాలోని 37 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే సింగిల్‌ నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆ స్థానాలు ఏకగ్రీవంగా చైర్మన్లు అయ్యారు. అనంతరం మిగిలిన 7 స్థానాలకుగాను రహస్య ఓటింగ్‌ పద్ధతిన నిర్వహించిన ఎన్నికల ద్వారా చైర్మన్‌ ఎన్నికలను అధికారులు పూర్తి చేశారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులకే రైతులు మద్దతు తెలుపడంతో ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మిగిలిన రెండు స్థానాలకు నేడు తిరిగి ఎన్నికలు నిర్వహించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను పూర్తి చేయనున్నట్లు జిల్లా కో-ఆపరేటివ్‌ అధికారి ప్రసాదరావు తెలిపారు. logo