ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 16, 2020 , 02:19:26

టీఆర్‌ఎస్‌ నాయకుడి హత్య

టీఆర్‌ఎస్‌ నాయకుడి హత్య

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల వేళ కాంగ్రెస్‌ రాజకీయ కక్ష్యలకు టీఆర్‌ఎస్‌ నాయకుడు బలయ్యాడు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఆరేళ్లుగా ఈ ప్రాంతంలో ఎలాంటి రాజకీయ ఘర్షణలు, హత్య లు లేవు. తాజాగా జరిగిన ఒంటెద్దు వెంకన్న(39) హత్య ప్రజలను ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి చేసింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకా రం.. యర్కారం గ్రామానికి చెందిన ఒంటెద్దు వెంకన్న 2014 నుంచి 2019 వరకు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2018లో టీఆర్‌ఎస్‌లో చేరి అత్యంత చురుకుగా పని చేస్తున్నాడు. 2019లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బలమున్న గ్రామమైన యర్కారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతమల్ల మౌనిక ఒక్క ఓటు మెజార్టీతో గెలిచింది. ఈ గెలుపులో అత్యంత కీలంగా వెంకన్న వ్యవహరించాడని ఓటమి పాలైన కాంగ్రెస్‌ అభ్యర్థి భర్త ఒడ్డె యల్లయ్య భావించి వెంకన్నపై కక్ష పెంచుకున్నాడు. 


ఈ క్రమంలోనే సహకార ఎన్నికలు రావడం... కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడం... అప్పటికే 13 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 5 స్థానాలు ఏకగ్రీవంగా గెలవడంతో మళ్లీ సూర్యాపేట పీఏసీఎస్‌ టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంటుందనే ఆక్రోశం కాంగ్రెస్‌ నాయకుల్లో నెలకొంది. నాలుగు రోజుల క్రితం సూర్యాపేట పట్టణంలోని సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా అక్కడకు యర్కారానికి చెందిన కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా వెళ్లారు. ఓటర్లను తీసుకువెళ్లి ప్రలోభాలకు గురిచేస్తున్నారనే అనుమానంతో వడ్డె యల్లయ్య, మరికొంత మంది కాంగ్రెస్‌ నాయకులు కూడా వెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒంటెద్దు వెంకన్న, వడ్డె యల్లయ్య మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఈ ఘర్షణను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బలం పెరుగుతుందని భావించి కాంగ్రెస్‌ నాయకుడు పటేల్‌ రమేశ్‌రెడ్డి ప్రోద్బలంతో వెంకన్నను యల్లయ్య హత్య చేశాడని మృతుడి భార్య నిర్మల ఆరోపించారు. 


ఉదయం నుంచే పన్నాగం

సహకార ఎన్నికలకు ఒక్క రోజు ముందు శుక్రవారం ఉదయం నుంచి గ్రామంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ముమ్మరంగా ప్రచారాలు చేశారు. ఉదయం నుంచే కాంగ్రెస్‌ నాయకుడు యల్లయ్య మరో 20 మందిని వెంటబెట్టుకొని వెంకన్నను హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశాడని ప్రత్యక్ష సాక్షి, హతుడు బంధువైన కిరణ్‌ తెలిపాడు. వారు అనుమానంగా కనిపిస్తున్నారని, గ్రామంలో ఉండకుండా వెళ్లిపోదామని వెంకన్నను వారించినా అలాగే ప్రచారం చేపట్టినట్లు పేర్కొన్నారు. అదేరోజు రాత్రి 12 గంటలు దాటిన తరువాత హతుడు వెంకన్నతో పాటు గ్రామ సర్పంచ్‌ భర్త చింతలపాటి మధు, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రవీణ్‌ ఉన్నారని, పక్క వీధిలో ఓ ఓటరు ఉన్నాడంటూ వెంకన్నను మధు ఓ సందులోకి తీసుకెళ్లాడని కిరణ్‌ తెలిపాడు. 


తాను ఇంటికి వెళ్లిపోతుండగా వెంకన్న, మధులు వెళ్లిన ప్రాంతానికి యల్లయ్యతో ఇతరులు వెళ్తుండడం గమనించి బైక్‌పై వెళ్లి హత్య చేస్తారనిపిస్తుందని.. వెళ్లిపోదామని వారించినా వెంకన్న, మధు వినిపించుకోకుండా వెళ్లినట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో వెనుక నుంచి 20 మంది రావడం గుర్తించి పరుగు తీశారని, సందు నుంచి మార్గం లేకపోవడంతో వెంకన్న, మధు, ప్రవీణ్‌ ఆవుదొడ్డి సైదులు ఇంట్లోకి ప్రాణభయంతో చొరబడినట్లు తెలిపారు. యల్లయ్య తన మనుషులతో కలిసి ఇంటి తలుపులు పగులకొట్టి ఇంట్లోని స్టోర్‌రూంలో ఉన్న వెంకన్నపై కత్తులు, రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడే ఉన్న ఇసుర్రాయిని తలపై బలంగా మోదారు. వెంకన్న చనిపోయాడని నిర్ధారించుకొని ఈలలు వేస్తూ వెళ్లిపోయారని కిరణ్‌ తెలిపాడు. మృతుడు వెంకన్న భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సూర్యాపేట పట్టణంలోని బాలాజీ నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో వెంకన్న ఆరు సంవత్సరాలుగా నివాసం ఉంటూ పని నిమిత్తం సొంతగ్రామానికి వెళ్తుండేవాడు. హత్య జరిగిన వెంటనే సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం వెంకన్న మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించి గ్రామంలో గొడవలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. 


సర్పంచ్‌ భర్త మధుపైనా అనుమానాలు

వెంకన్న వెంట ఉన్న సర్పంచ్‌ భర్త చింతలపాటి మధుకు హత్యలో హస్తం ఉందంటూ వెంకన్న భార్య నిర్మళ ఆరోపించింది. హత్యకు పాల్పడిన యల్లయ్య, మధు దగ్గరి బంధువులని, ప్రచారం పూర్తయిన తరువాత కావాలనే తన భర్తను సందులోకి తీసుకువెళ్లి హత్యకు సహకరించాడని పోలీసుల ఎదుట రోదించింది. మధును కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. 


యల్లయ్యది క్రిమినల్‌ చరిత్రే..

వెంకన్న హత్యకు పాల్పడిన వడ్డె యల్లయ్య గతంలో జనశక్తిలో పనిచేశాడు. ఈయనపై అనేక అంతర్గత పంచాయతీలు, బెదిరింపులు, మోసాలు, దోపిడీలు చేసినట్లు తెలుస్తుంది. 2008లో తిరుమలగిరిలో జరిగిన ఓ హత్య కేసులో యల్లయ్య నిందితుడు. అలాగే 2009లో అర్వపల్లిలో తుపాకులతో బెదిరించి రాబరీ చేసిన ఘటన, 2011లో కొట్లాట కేసులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటితో పాటు 2017లో హైదరాబాద్‌ మదాపూర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఓ చీటింగ్‌ కేసు నమోదైన్నట్లు సూర్యాపేట పోలీసుల ద్వారా తెలిసింది.


కంట తడి పెట్టిన మంత్రి జగదీశ్‌రెడ్డి

హత్య జరిగిన విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నారు. వెంకన్న మృత దేహాన్ని సందర్శించి, మృతుడి భార్య, కూతుళ్లను చూసి కంటతడి పెట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించగా మంత్రి వెంట ఉండి అంతిమయాత్రలో పాల్గొని అంత్య క్రియలు పూర్తయ్యేంత వరకు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజల హృదయంలో గొప్ప నాయకుడిగా ఎదుగుతున్న వెంకన్నను చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ నాయకులు పధకం ప్రకారమే హత్య చేయించారని ధ్వజమెత్తారు. గడిచిన ఆరేళ్లలో కొట్లాటలకు తావులేకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టామని, ఈ క్రమంలో కేసీఆర్‌ చేసే అభివృద్ధిని చూసి గ్రామాలే స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాయన్నారు. ఎంత రెచ్చగొట్టినా చట్టాలను ఉల్లంఘించకుండా చట్టపరిధిలోనే నేరస్తులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి అన్నారు. మృతుడి కుటుంబాన్ని తమ కుటుంబంగానే భావించి అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

నిందితులపై కఠిన చర్యలు : ఎస్పీ రంగనాధ్‌ 

హత్య జరిగిన విషయం తెలుసుకున్న సూర్యాపేట ఇన్‌చార్జి ఎస్పీగా వ్యవహరిస్తున్న నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ సూర్యాపేటకు చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వ దవాఖానలోని పోస్టుమార్టం గదిలో వెంకన్న మృతదేహాన్ని పరిశీలించి గ్రామస్తులు, కుటుంభ సభ్యులు, ప్రతక్ష్య సాక్షులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, త్వరలోనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. 


logo