గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Feb 15, 2020 , 00:33:48

సహకార ఎన్నికలకు పోలింగ్‌ నేడే

సహకార ఎన్నికలకు పోలింగ్‌ నేడే
  • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
  • రేపు పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు
  • ఆ వెంటనే కౌంటింగ్‌.. ఫలితాల వెల్లడి

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల సమరం నేటితో ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణలు పూర్తయ్యాయి. నేడు పోలింగ్‌ జరుగనుండగా అధికారులు అన్నీ సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 47 పీఏసీఎస్‌ల పరిధిలోని 611 డైరెక్టర్లకుగాను పొనుగోడు వాయిదా పడడంతోపాటు మూడు చోట్ల ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో అభ్యర్థులు లేక 595 డైరెక్టర్లకే ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అలాగే 46 పీఏసీఎస్‌లలో 10 పీఏసీఎస్‌లు వందశాతం ఏకగ్రీవం కాగా మొత్తం 297 మంది డైరెక్టర్లు ఏకగ్రీవం అయ్యారు. దీంతో మిగిలిన 298 డైరెక్టర్లకు ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. 


శుక్రవారం సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఎన్నికలు జరిగే 298 డైరక్టర్లకుగాను అంతే సంఖ్యలో బ్యాలెట్‌ బాక్స్‌లు తెలుపు రంగు కలిగిన 93,602 బ్యాలెట్‌ పత్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించిన అనంతరం 2 గంటల నుంచి ఒక్కో వార్డు చొప్పున కౌంటింగ్‌ చేపడతారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి అభ్యర్థి లేదా ఏజెంట్‌ ఎవరైనా ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు. ఫలితాల అనంతరం ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసి ఫలితాల మరుసటి రోజు అంటే ఈ నెల 16న ఉదయం 9గంటలకు రహస్య ఓటింగ్‌ పద్ధతిన ఆయా పీఏసీఎస్‌లలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను నిర్వహిస్తారు. logo