మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 15, 2020 , 00:16:28

అంగరంగ వైభవంగా..

అంగరంగ వైభవంగా..
  • పెన్‌పహాడ్‌ మండలం అనంతారంలో శ్రీసీతారామాంజనేయ విగ్రహాలు, జీవధ్వజ ప్రతిష్ఠ

పెన్‌పహాడ్‌ : మండలంలోని అనంతారంలో శుక్రవారం వేలాది భక్తజనం నడుమ వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసీతారామలక్ష్మణాంజనేయ స్వాముల విగ్రహాలను దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన దేవాయలంలో ప్రతిష్ఠించారు. దేవాలయం ఎదురుగా జీవధ్వజ ప్రతిష్ఠను  వేదపండితులు శ్రీజగద్గురువు ఆదిశంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాదీశ్వరులు శ్రీ విద్యారణ్య భారతీస్వామీ ఆధ్వర్యంలో వైభవంగా ప్రతిష్ఠింపజేశారు.గ్రామస్తులు దేవతా మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం,  పంచగవ్య ప్రాస, మూర్తిన్యాసం, ప్రభాతబలి, కుంకుమపూజ తదితర పూజలు నిర్వహించారు.  అలాగే శివాలయంలో నవగ్రహ ప్రతిష్ఠతోపాటు శివలింగం, నందీశ్వరుడు విగ్రహాల ప్రతిష్ఠ కనుల పండువగా జరిగింది. దళిత కాలనీలో ముత్యాలమ్మ దేవాలయంలో ముత్యాలమ్మ, సత్తెమ్మతల్లి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. సాయంత్రం ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గ్రామమంతా బంధువులతో కిక్కిరిసిపోయింది. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  అన్నదానం చేశారు.  


ప్రత్యేక పూజల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి 

ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విచ్చేసి శ్రీరామాంజనేయ స్వాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ, భక్తులు సంప్రదాయ బద్ధంగా మంత్రిని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సుపరిపాలన అందించాలని పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామీ ఆశీస్సులు అందించారు. అదేవిధంగా టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేశ్‌రెడ్డి, సుధాకర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చైర్మన్‌ మీలా మహదేవ్‌ దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.   


logo