మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 13, 2020 , 04:13:16

అన్నీ గెలిచేలా.. గులాబీ గురి

అన్నీ గెలిచేలా.. గులాబీ గురి

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ  : ఈ నెల 15న జరుగనున్న సహకార సంఘాల ఎన్నికల్లోనూ ఏకపక్షంగా సత్తా చాటేందుకు టీఆర్‌ఎస్‌ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మొత్తం ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌ పాలనకు జై కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఒక్క పీఏసీఎస్‌ పీఠం సైతం ప్రతిపక్షాలకు దక్కకుండా అన్ని స్థానాలూ గెలుచుకునేలా టీఆర్‌ఎస్‌ పని చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 పీఏసీఎస్‌ల పరిధిలో మెజార్టీ డైరెక్టర్‌ వార్డులు ఏకగ్రీవం కాగా.. 19స్థానాల్లో టీఆర్‌ఎస్‌ నేతలే చైర్మన్లుగా ఎన్నికయ్యే విధంగా ముందుగానే ఏర్పాట్లు చేపట్టింది. మిగిలిన 89పీఏసీఎస్‌ పరిధిలోనూ ఇప్పటికే మొత్తం 200కు పైగా వార్డులు ఏకగ్రీవం కాగా మెజార్టీ స్థానాలు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే గెలుచుకున్నారు. ప్రతిపక్షాల మద్దతుతో అక్కడక్కడా పోటీలో నిలిచిన నాయకులను సైతం రైతుల మద్దతుతో టీఆర్‌ఎస్‌ మద్దతు పొందిన రైతు నేతలు ఓడించడం సులభమనే విశ్లేషణలే జిల్లా అంతటా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌ల చైర్మన్‌ స్థానాలను సైతం తామే గెలుచుకుంటామనే ధీమాను టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్లుండి జరగనున్న పోలింగ్‌కు.. ఈరోజు మాత్రమే ప్రచారానికి ఆఖరి రోజు కాగా చివరి నిమిషం వరకూ జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు నేతలు సూచించారు. 

డీసీసీబీ పీఠంపై పలు అంచనాలు...

టీఆర్‌ఎస్‌ మెజార్టీ పీఏసీఎస్‌లు దక్కించుకోవడం ఖాయమైన నేపథ్యంలో.. ఆ పార్టీలోని పలువురు ముఖ్యనేతలు ఇప్పటికే డీసీసీబీ చైర్మన్‌ పీఠంపై గురి పెట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన యడవెల్లి విజయేందర్‌రెడ్డి తొలిసగం, ముత్తవరపు పాండురంగారావు రెండో సగం చైర్మన్‌గా వ్యవహరించారు. అయితే పాలకవర్గం ఏర్పాటైన కొద్దిరోజులకే ఆ ఇద్దరితోపాటు పెద్దసంఖ్యలో డైరెక్టర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి నేరుగా తమ ఖాతాలోనే డీసీసీబీ పీఠాన్ని వేసుకోవాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ నుంచి.. ఆ పీఠంపై కన్నేసిన నాయకుల సంఖ్య సైతం సహజంగానే ఎక్కువగా ఉంది. గతంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లుగా వ్యవహరించిన మాజీలతోపాటు.. పీఏసీఎస్‌ చైర్మన్లుగా పని చేసిన అనుభవం ఉన్న నేతలు, యువ నాయకుల పేర్లు డీసీసీబీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ సహా ఇతరపార్టీల నుంచి కనీసం పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎవరవుతారనే అంశం కూడా అంతగా చర్చలో కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. logo