మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 13, 2020 , 04:10:26

ప్రాదేశిక నియోజకవర్గాలకూ ఆర్థిక సంఘం నిధులు

ప్రాదేశిక నియోజకవర్గాలకూ  ఆర్థిక సంఘం నిధులు

నల్లగొండ, నమస్తే తెలంగాణ : గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రణాళికలో భాగంగా గడిచిన 5నెలలుగా 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విడుదల చేపడుతోంది. ఒక్కో మనిషికి రూ.167ల చొప్పున ప్రతి నెలా నిధులను విడుదల చేస్తూ గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమచేస్తుంది. ఈ నిధులను స్థానిక పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వినియోగిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రజాప్రతినిధుల కోవలోకి వచ్చే మండలపరిషత్‌, జిల్లాపరిషత్‌ ప్రాదేశిక సభ్యులకు సైతం ఈ నిధుల్లో కేటాయింపులు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఏప్రిల్‌ నుంచి అమలు చేసేందుకు యోచిస్తోంది. మండల పరిషత్‌లకు సగటున విడుదలైన నిధుల్లో 10శాతం, జిల్లా పరిషత్‌లకు 15శాతం ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో విడుదల కానున్నాయి. 

    నిధుల్లో మండల, జిల్లా పరిషత్‌లకు సైతం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీలతోపాటు మండలపరిషత్‌లు, జిల్లాపరిషత్‌లకు సైతం కేటాయించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకే ఈ నిధుల విడుదల చేస్తుండగా గ్రామీణ పాలకవర్గాల్లో అంతర్భాగమైన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యులకు సైతం అభివృద్ధి నేపథ్యంలో ఈ నిధులను కేటాయించనున్నారు. జిల్లా వ్యాప్తంగా విడుదలైన నిధుల్లో కనిష్టంగా మండల పరిషత్‌లకు 5శాతం నుంచి గరిష్టంగా 15శాతం, జిల్లా పరిషత్‌లకు కనిష్టంగా 10 శాతం నుంచి గరిష్టంగా 25శాతం వరకు నిధుల కేటాయింపు చేసే అవకాశం ఉంది. అయితే మొత్తం నిధుల్లో ఏ మేరకు ఇస్తారనేది త్వరలో నిర్ణయించి ఈఏడాది ఏప్రిల్‌ నుంచి విడుదలైన నిధుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సైతం కేటాయింపులు చేయనున్నారు.

  5నెలలుగా రూ.100 కోట్ల నిధులు విడుదల...

పల్లెప్రణాళికలో భాగంగా గ్రామపంచాయతీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా నిధుల విడుదల చేపడుతుంది. గ్రామీణ ప్రాంతంలో నివసించేవారిని పరిగణలోకి తీసుకొని 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి మనిషికి రూ.167లు చెల్లిస్తోంది. ఆ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఉన్న 844 గ్రామ పంచాయతీలకు సుమారు ప్రతి నెలా రూ.20 కోట్లు వస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు 5 నెలలుగా రూ.20 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమచేశారు. వీటిని వినియోగించుకుని పంచాయతీ పాలకవర్గాలు స్థానిక అవసరాలను తీర్చుతూ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇక నుంచి ఈ నిధుల్లో కొంతమేరకు తగ్గి మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల ఖాతాల్లో జమ కానున్నాయి.

  ప్రతి నెలా రూ.5 నుంచి 7కోట్లు పరిషత్‌లకు...

15వ ఆర్ధిక సంఘం నుంచి విడుదలయ్యే రూ.20 కోట్లలో ప్రతి నెలా సగటున రూ. 5కోట్ల నుంచి 7కోట్ల వరకు మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు కేటాయించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో ఉన్న మండల పరిషత్‌ల్లో అక్కడ ప్రాతినిధ్యం వహించే ఎంపీటీసీలతోపాటు ఆయా మండలాల్లో ఉన్న జడ్పీటీసీలకు ఈ నిధులు కేటాయించనున్నారు. సర్కార్‌ సూచన మేరకు మొత్తంగా మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయింపులు అయ్యాక సభ్యుల వారీగా స్థానిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి పాలకవర్గాలు కేటాయింపులు చేయనున్నారు. దీనికి సంబంధించిన మౌఖిక ఆదేశాలు వచ్చినప్పటికి త్వరలో అధికారికంగా సర్క్యూలర్‌ వెలువడగానే ఏప్రిల్‌ నుంచి అమలు చేయనున్నారు. 


logo