శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Feb 13, 2020 , 00:38:26

ఢిల్లీ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు

ఢిల్లీ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు

అర్వపల్లి : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టులాంటిదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని.. ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ఢిల్లీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పాగ వేసేందుకు బీజేపీ శక్తియుక్తులన్నీ వడ్డినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికలు ఏవైనా రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్‌కు అండగా నిలుస్తున్నారని తెలిపారు. సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రైతులంతా టీఆర్‌ఎస్‌కు జేజేలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. సమావేశంలో అర్వపల్లి జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కొప్పుల భరత్‌రెడ్డి, పుప్పాల శేఖర్‌, పి.ఎర్ర నర్సయ్య, తోట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.logo