బుధవారం 03 జూన్ 2020
Suryapet - Feb 12, 2020 , 03:52:17

వరి సాగు @1,13,940 హెక్టార్లు

 వరి సాగు @1,13,940 హెక్టార్లు

నీలగిరి : జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. గతేడాది అక్టోబర్‌ 15నుంచి యాసంగి సీజన్‌ ప్రారంభం కాగా సాగర్‌ ఎడమ కాల్వతోపాటు ఏఎమ్మార్పీ ఆయకట్టుకు ప్రభుత్వం సాగునీరు విడుదల చేసింది. నీటి విడుదల కాస్తా ఆలస్యంగా జరిగినా సాగు విస్తీర్ణం మాత్రం ఆశించిన స్థాయిలో పెరిగింది. నవంబర్‌, డిసెంబర్‌లో సింహభాగం నాటు పూర్తయినా జనవరిలోనూ కొన్ని ప్రాంతాల్లో వేశారు. ఈ ఏడాది చెరువులు, బోరుబావుల కింద సైతం వరి సాగుకే రైతులు మొగ్గు చూపారు. గతేడాది ఎడమ కాల్వకు నీటి విడుదల లేకపోగా ఈ ఏడాది ఆరుతడి పద్ధ్దతిన విడుదల చేసింది. 

1,20,727 హెక్టార్లలో పంటల సాగు...

యాసంగి సీజన్‌ అక్టోబర్‌ 15నుంచి ప్రారంభమైనా నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో 1,20,727 హెక్టార్లలో ఆయా పంటల సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 1,13,940 హెక్టార్లులో వరి సాగు చేశారు. ప్రధానంగా ఎడమ కాల్వ  ఆయకట్టులో అధిక విస్తీర్ణంలో వరి సాగైంది. ఏఎమ్మార్పీకి సైతం నీటి విడుదల చేసి చెరువులు నింపడంతో ఆయకట్టు పరిధిలోని బీడు భూములు సాగులోకి వచ్చాయి. సాగర్‌ ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో 64,441 హెక్టార్లలో చెరువుల కింద 2720 హెక్టార్లలో బోరుబావుల కింద 46785 హెక్టార్లు వరి సాగైంది. సాగర్‌ ఎడమ కాల్వకు వారబందీ పద్ధ్దతిలో నీటి విడుదల చేస్తుండగా ఈ నీటిని వినియోగించుకోని రైతులు వరి సాగు చేశారు. 

అంచనాలకు మించి వరి...

గతేడాదతో పోలిస్తే యాసంగిలో దాదాపు 50 శాతం అదనంగా రైతులు వరి సాగు చేశారు. ఈ సంవత్సరం వర్షాలు విస్తరంగా కురవడంతో ప్రాజెక్టులు పూరిస్థ్ధాయిలో నిండాయి. దీంతో సాగర్‌ ఎడమ కాల్వతోపాటు ఏఎమ్మార్పీ, వరుదకాల్వకు సైతం నీటి విడుదల చేశారు. గతేడాది 86 వేల హెక్టార్లలో వరి సాగువగా ఈసారి సుమారు 1,13,940 హెక్టార్లుల్లో సాగైనట్లు అంచనా. వానాకాలం ముగింపులో వర్షాలు భారీగా కురవడంతో సాగర్‌ పూర్తిస్థాయిలో నిండింది. ఈ క్రమంలో ఏఎమ్మార్పీకి తాగునీటి కోసం నీటి విడుదల చేసి అన్ని చెరువులూ నింపారు. సాగర్‌ ఎడమ కాల్వకు విడుతల వారీగా నీటి విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టు కింద వరి సాగు గణనీయంగా పెరిగింది. 

ఫలితమిచ్చిన ‘మిషన్‌ కాకతీయ’.. 

మిషన్‌ కాకతీయ పథకం కింద ఉమ్మడి జిల్లాలో యేటా 952 చెరువులు పునరుద్ధ్దరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూడు విడుతలుగా పనులు పూర్తి చేసి నాలుగో విడుత అమలులో నిమగ్నమైంది. మూడు దశల్లో చెరువుల పునరుద్ధ్దరణ పనులు పూర్తికావడంతో వాటిలో నీటి నిల్వలు పెరిగి భూగర్భ జలాలు సైతం నిలకడగా ఉన్నాయి. దీంతో వట్టిపోయిన బోర్లలో ఊట పెరిగడంతో బోరుబావుల కింద వరితోపాటు 5328 హెక్టార్లలో పప్పు దినుసులు సాగు చేశారు. 5236 హెక్టార్లలో వేరుశెనగ సాగు చేశారు. ఈ ఏడాది సాధారణ సాగుకు మించి రైతులు మెట్ట పంటలు సాగు చేశారు. 3,35, 055 హెక్టార్లలో ఆయా పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,27,112 (98 శాతం) హెక్టార్లలో సాగయ్యాయి. సాధారణ పంట సాగు 66,436 హెక్టార్లుగా ఉండగా 71,436 ( 108 శాతం) హెక్టార్లలో సాగు చేశారు. పత్తి 2,28,150 హెక్టార్ల సాధారణ సాగుకు 2,35,408 (103 శాతం) హెక్టార్లలో సాగైంది. ఇక కందులు 5816 , పెసర 796 హెక్టార్లు, వేరుశెనగ 563, జొన్న 296 హెక్టార్లలో  సాగు చేశారు. 


logo