శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 11, 2020 , 02:52:01

ఐటీఐ విద్యార్థి అద్భుతాలు

ఐటీఐ విద్యార్థి అద్భుతాలు

పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, కార్లు, స్కూటీలు, టీవీఎస్‌ తదితరాలకు బ్యాటరీలు ఫిట్‌ చేసి జీరో పొల్యుషన్‌తో వాహనాలు నడిచేలా తయారు చేస్తున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు పొగ కాలుష్యాన్ని తగ్గిస్తున్నాడు. వాహన సామర్థ్యాన్ని బట్టి వివిధ ఓల్టేజీల బ్యాటరీలను, మోటార్లను వాహనాలకు అమర్చి బ్యాటరీతో నడిపిస్తున్నాడు. ద్విచక్ర వాహనాలతో పాటు సైకిల్‌, ట్రై సైకిల్‌, రిక్షాలకు సైతం బ్యాటరీ, మోటార్లు బిగించి శ్రమ, ఇంధన పొదుపుకు కృషిచేస్తున్నాడు. 


గంటకు 60 కి.మీ. వేగం 

కారుకు 5 కిలో వాట్స్‌, ఆటో- 3 కిలోవాట్స్‌, బైక్‌కు -1కిలో వాట్‌, రిక్షాకు-800 వాట్స్‌, సైకిల్‌కు -350 వాట్ల సామర్థ్యం కలిగిన హబ్‌, బ్రష్‌ మోటార్లు బిగిస్తారు. వీటికి పవర్‌ సప్లయ్‌ అందించేందుకు 48/30 ఏహెచ్‌, 48/25 ఏహెచ్‌ సామర్థ్యం కలిగిన లిథియం  బ్యాటరీలను అమర్చుతారు. వీటి ఆధారంగా మూడుగంటల పాటు చార్జింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలపై గంటకు 50 కి.మీ వేగంతో 60 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. సైకిల్‌ పై 30కి.మీ వేగంతో 60కి.మీ దూరం ప్రయాణించవచ్చు. 


ధరలు ఇలా.. 

సైకిల్‌కు బ్యాటరీ, కేబుల్స్‌, లైట్లు ఇతర పరికరాలు బిగించడానికి రూ.11 వేలు ఖర్చవుతుంది. అదేవిధంగా ద్విచక్రవాహనానికి రూ.35 వేల వరకు ఖర్చవుతుంది. కార్లు ఇతర వాహనాలకు వాటి సామర్థ్యాన్ని బట్టి ఖర్చు పెరుగుతుంది. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్‌, బ్యాటరీ రెండింటిపై నడిపించడంతో పాటు ఆటోమేటిక్‌గా బ్యాటరీ చార్జింగ్‌ అయ్యే సౌకర్యం పొందాలంటే రూ.45వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మూడుగంటల పాటు చార్జింగ్‌ పెట్టడం ద్వారా 3 యూనిట్ల వరకు మాత్రమే విద్యుత్‌ ఖర్చవుతుంది. రూ.20లోపే ఖర్చు చేయాల్సి ఉంటుంది. 


తయారీ ఇలా..

కారు, బైక్‌, స్కూటీ, సైకిల్‌, రిక్షాలను వాహన సామర్థ్యాన్ని బట్టి వాటికి అవసరమైన కెపాసిటీ కలిగిన బ్యాటరీ, మోటార్లను బిగిస్తాడు. బండి హార్స్‌ పవర్‌ సామర్థ్యానికి సరిపడే సామర్థ్యం కలిగిన బ్యాటరీని వాహనానికి బిగించడంతో పాటు వేగంగా వీల్స్‌ తిప్పగలిగే హబ్‌ మోటార్లు ఏర్పాటు చేస్తాడు. అనంతరం ఏసీ విద్యుత్‌ను డీసీ విద్యుత్‌గా మార్చే ఎలక్ట్రికల్‌ పరికరాలను బ్యాటరీలకు అనుసంధానం చేస్తాడు. దీంతో బ్యాటరీ ఆన్‌చేసి ఎక్స్‌లేటర్‌ రేజ్‌ చేయగానే వాహనం ముందుకు సాగుతుంది. ఎక్స్‌లేటర్‌ తగ్గిస్తే వాహనం స్పీడ్‌ తగ్గుతుంది. లిథియం బ్యాటరీ, మోటార్‌లను అనుసంధానించే ఎలక్ట్రికల్‌ పరికరాలతో పాటు వాటి పనితీరు మెరుగుపర్చే ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాహన అవసరాలకు ఉపయోగిస్తాడు. 


అవకాశమిస్తే శిక్షణ ఇస్తా..

నేటి జీవన విధానంలో బైక్‌, కారు తప్పనిసరిగా మారాయి. దగ్గర అవసరాలకు సైతం వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నుంచి పొగ వెలువడి పర్యావరణానికి హాని కలుగుతుంది. దీనికి తోడు ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో బ్యాటరీ వాహనాల వినియోగం ఎంతో ఉపయోగకరం. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు డబ్బు ఆదా చేసుకునేందుకు బ్యాటరీ వాహనాలు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ఒక్కసారి పెట్టుబడితో ఎక్కువ రోజులు వాహనాన్ని నడపొచ్చు. వాహన సామర్థ్యాన్ని బట్టి మూడు, ఆరు గంటలు చార్జింగ్‌ చేసుకుంటే 60 నుంచి 100 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. దాతలు సహకరిస్తే బ్యాటరీ వాహనాల తయారీలో నాకున్న పరిజ్ఞానాన్ని ఇతరులకు నేర్పుతా.  

- సయ్యద్‌ జానీబాబా, బ్యాటరీ వాహన తయారీదారుడు


ఢిల్లీ, ముంబాయి నుంచి మోటార్లు 

ఏసీ విద్యుత్‌ను డీసీగా మార్చుకొని నడిచే మోటార్లను ఢిల్లీ, ముంబాయి మహానగరాల నుంచి తెప్పిస్తాడు. హైదరాబాద్‌ చెన్నై నగరాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. తక్కువ ధరకు బ్యాటరీ వాహనాల తయారీకి ఇది ఎంతో ఉపకరిస్తుంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులను నడుపుతుంది. 


బ్యాటరీ సైకిల్‌ సౌకర్యవంతంగా ఉంది..

మాది చింతపల్లి ఇందిరమ్మ కాలనీ. కాలనీ నుంచి రోజు కళాశాలకు సైకిల్‌పై వస్తా.  సైకిల్‌ తొక్కే క్రమంలో కొన్నిసార్లు అలసటగా ఉండేది. బ్యాటరీ సైకిల్‌ చూసి, నేను తయారుచేయించా. 30కి.మీ స్పీడుతో వెళ్తున్నందున కళాశాలకు వెళ్లి రావడంలో టైం ఆదా కావడంతో పాటు అలసట సైతం తగ్గింది. రాత్రి వేళ లైట్‌ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంది. హారన్‌ కూడా ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేవు.

- రఘురాం, ఐటీఐ విద్యార్థి 


logo