బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 11, 2020 , 02:48:10

అధికం అనర్థమే..

అధికం అనర్థమే..

మొక్కలపై కనిపించే ఐదు రకాల ప్రభావాలు 

1.ఆకులు మాడటం 

కొన్ని రకాల క్రిమిసంహారక మందులను మొక్కలపై పిచికారీ చేసిన తరువాత ఆకుల చివర్ల గానీ అంచులు గానీ మాడుతాయి. ఇవి ఆకులపై మచ్చల మాదిరిగా కొంతవరకు పరమితమవడం లేక ఆకంతా మాడిపోవడంగాని జరుగుతుంది. ఒక్కోసారి మొక్క పెరుగుదల సైతం ఆగిపోవచ్చు. 


2. మొక్కల కణజాలం చనిపోవడం 

మొక్కల్లో వివిధ భాగాల్లో కణజాలం చనిపోయి, తెగులు సోకినప్పడు వచ్చే మచ్చలమాదిరిగా తుప్పు రంగు మచ్చలు ఏర్పడుతాయి. 


3. ఆకులు పసుపు బారటం.. 

కొన్ని రకాల క్రిమిసంహారక మందులను పిచికారీ చేసిన తరువాత ఆకులపై పసుపు రంగు మచ్చలుగాని, ఆకు చివర్లు ఎండటంగాని జరుగుతుంది. కొన్నిసార్లు ఆకంతా పండిపోతుంది. 

4. ఆకులు వంకర్లు తిరగడం 

క్రిమి సంహార మందులు పిచికారీ తరువాత ఆకులు ముడుచుకుపోవడం లేక ఆకులపై బొబ్బలు రావడం, ఆకులు కప్పు మాదిరిగా అంచుల నుంచి పైకి ముడుచుకుని పోతాయి. 

5. మొక్కలు గిడసబారటం 

పెరుగుదల లోపించి మొక్కలు గిడసబారిపోతాయి. సాధారణంగా పిచికారీ మందులను మోతాదుకు మించిగాని, మిశ్రమ మందులు పిచికారీ చేసినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా ఈ లక్షణాలు లేత ఆకులపై కనిపిస్తాయి. 


నివారణకు ఏం చేయాలంటే .. 

మొక్కలు తీవ్ర ఒత్తిడితో ఉన్నప్పుడు అంటే అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మి తీవ్రత ఉన్న సమయంలో, తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయొద్దు. నీటి ఎద్దడి సమయంలో కూడా చేయకూడదు.

మందుల పిచికారీలో నీటిలో కరిగిపోయే పొడి మందులు సురక్షితం. కానీ పిచికారీ చేసే సమయంలో పొడి ట్యాంకు కింది భాగంలో చేరకుండా తరచూ పిచికారీకి వినియోగించాలి. 

పురుగు, తెగుళ్ల మందులను పిచికారీ చేసే సమయంలో అధికారుల సూచనల మేరకు తగిని మోతాదులో పిచికారీ చేయాలి. పొడిరూపంలో ఉన్న తెగుళ్ల మందును, అరుకు రూపంలో ఉన్న పురుగుమందులు వినియోగించరాదు. ఒకే రూపంలోని మందులను మాత్రమే కలపాలి.

రెండు మూడు రకాల పురుగు మందులు కలిపి పిచికారీ చేయొద్దు. పిచికారీ చేయాల్సివస్తే అధికారులను సంప్రదించి సలహాలు తీసుకున్న తరువాతే చేయాలి. 

క్రిమి సంహారక మందుల మిశ్రమాలను పురుగు, తెగుళ్ల నివారణకు ఒకేసారి పొలంలో వాడాల్సి వస్తే ప్రాథమికంగా వాటిని కలిపి కొన్ని మొక్కలపై 3-4 రోజుల వ్యవధిలో 3-4సార్లు పిచికారీ చేసి వాటి దుష్ప్రభావాలను పరిశీలించాలి. దుష్ప్రభావాలు ఉంటే 18-72 గంటల్లో బయటపడుతాయి. 

క్రిమిసంహారక మందులతో ఎరువులను కలిపి పిచికారీ చేయొద్దు. 

పురుగు, తెగుళ్ల మందుల పిచికారీకి ఉపయోగించే స్ప్రేయర్‌ను కలుపుమందుల పిచికారీకి వాడొద్దు. 


పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

మందులు పిచికారీ చేసే సమయంలో అవి శరీరంపై పడకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే రక్షణ దుస్తులు, ముఖానికి మాస్క్‌ చేతులకి గ్లౌజులు ధరించాలి. పొగ తాగడం, నీరుతాగడం, తినడం గానీ చేయొద్దు. 

పిచికారీకి ముందు స్ప్రేయర్లు కండిషన్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి.

మందులను చేతులతో కలపకూడదు. కర్రను వినియోగించాలి. 

గాలి వీచే దిశలోనే మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. 

స్ప్రేయర్‌ నాజిల్‌ను శుభ్రపరిచేటప్పుడు నోటితో గాలి ఊదకూడదు. 

ప్రమాదవశాత్తు మందు కళ్లలో పడితే వెంటనే శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. 

కీటకనాశిని మందు డబ్బాలను ఖాళీ అయిన వెంటనే వాటిని గొయ్యితీసి తగులబెట్టాలి. ఇతర అవసరాలకు వాటిని వినియోగించరాదు. 

పిచికారీ పూర్తయిన వెంటనే స్నానంచేసి దుస్తులను శుభ్రపర్చుకోవాలి. 

ప్రమాదవశాత్తు విషప్రభావం కలిగితే ప్రాథమిక చికిత్స అందించి అనంతరం వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. 

పిచికారీ పుర్తయిన తరువాత స్ప్రేయర్ల ట్యాంకు బయట, లోపల శుభ్రంగా కడిగి వాటి భాగాలకు ఇంజిన్‌ అయిల్‌ పట్టించి జాగ్రత్త పర్చుకోవాలి. 


logo