ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 11, 2020 , 02:47:33

కోమటిరెడ్డి చరిత్ర.. అసమర్ధుడి జీవితయాత్ర

కోమటిరెడ్డి చరిత్ర.. అసమర్ధుడి జీవితయాత్ర

నకిరేకల్‌, నమస్తే తెలంగాణ : పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జీవిత చరిత్ర అసమర్ధుడి జీవితయాత్ర లాంటిదని బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజర్ల శంభయ్య అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోమటిరెడ్డి వల్లనే 2013లోపు పూర్తికావాల్సిన బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పనులు నేటికీ కూడా పూర్తవ్వలేదన్నారు. 2007లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.561.96 కోట్లు మంజూరు చేసి పాలనా అనుమతులు ఇచ్చిందన్నారు. 2008లో మైటాస్‌తో ఒప్పందం చేసుకున్నప్పటికీ పనులు పూర్తిచేయకుండా కాలక్షేపం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి ఏమీ చేయలేని అసమర్ధుడిగా మిగిలపోయాడని ఎద్దేవా చేశారు. నల్లగొండకు మెడికల్‌ కాలేజి, బత్తాయి మార్కెట్‌ను తీసుకురాలేని అసమర్ధుడు వెంకట్‌రెడ్డి అన్నారు. తానుచేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రాజెక్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిధులు మంజూరు చేయడంలేదని ఆరోపణ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుండి ఇప్పటివరకు కాలువ, టన్నెల్‌, సబ్‌స్టేషన్‌ ఏర్పాటు, పంపుహౌజ్‌ నిర్మాణపనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. కేవలం 7.5కిలోమీటర్ల మేర కాలువ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ఈ పనులు ఆధునీకరణ కూడా వెంకట్‌రెడ్డి మూలంగానే ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. తాను టీఆర్‌ఎస్‌పార్టీలో చేరితే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్‌ అంటున్నారని వెంకట్‌రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని శంభయ్య దుయ్యబట్టారు. తన పనుల కోసం సీఎం వద్దకు వెళ్లి వచ్చే కోమటిరెడ్డి బయటకు వచ్చి నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. కోమటిరెడ్డికి మతిభ్రమించడంతోనే పూటకోమాట మాట్లాడుతున్నాడన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, కొండా వెంకన్నగౌడ్‌, మంగినపల్లి రాజు, పెండెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo