గురువారం 02 జూలై 2020
Suryapet - Feb 08, 2020 , 03:33:09

సహకార ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..

సహకార ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలి
  • రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయం
  • కిష్టంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం
  • ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
  • సనుగులలో గులాబీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం
  • మల్కపేట రిజర్వాయర్‌ పనుల పరిశీలన
  • గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

చందుర్తి: టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అభ్యర్థుల ను భారీ మెజార్టీతో గెలిపించుకుని, సహకార సం ఘాల ఎన్నికల్లో సత్తా చాటుదామని గులాబీశ్రేణులకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. మండలంలోని సనుగుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని చైర్మన్‌, డైరెక్టర్ల పదవి కోసం టీఆర్‌ఎస్‌కు చెందిన 13మంది అభ్యర్థులు ఇటీవలే నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే అనేక పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను ఉదహరించారు. 


టీఆర్‌ఎస్‌ హయాంలోనే సహకార సంఘాలు నష్టాల నుంచి బయట పడి లాభా ల బాట పట్టాయని, రైతులు కోరిన వెంటనే రుణాలిచ్చే స్థాయికి సహకార సంఘాలు చేరుకున్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వర్షాలు సరిగా లేకపోవడంతో రైతు లు గల్ఫ్‌ బాట పట్టేవారని, రాష్ట్ర ఏర్పాటుతో ఆ పరిస్థితులు మారాయని గుర్తుచేశారు. ఎత్తిపోతల ద్వారా, గొలుసుకట్టు చెరువుల ద్వారా మెట్ట ప్రాం తమైనా వేములవాడ నియోజకవర్గంలో చందుర్తి, రుద్రంగి ప్రాంతాల్లో దాదాపుగా 55 వేల ఎకరాలకు వేసవిలోనూ సాగునీరును అందజేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దేనని తెలిపారు. రాష్ట్రంలోని గోదాంలు ధాన్యం నిల్వలతో కళకళలాడుతున్నాయని, దేశంలో రైతే రాజనే పరిస్థితులు రావాలని తెలిపారు. రైతులు ఒకే రకమైనా పంటలు సాగు చేయకుండా, పంట మార్పిడి పద్ధతి పాటించాల ని, తద్వారా లాభాలను గడించవచ్చని తెలిపారు. 


ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి

రైతులు పంటను అమ్ముకొనే విధానం కల్లం వద్దనే ఆగిపోకుండా, వడ్ల నుంచి బియ్యం తీసి అమ్మే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. అందుకోసం అవసరమైతే ఆహారశుద్ధి కేంద్రాలను రైతులే ఏర్పాటు చేసుకోవాలని, దానికి సహకార సంఘాలు సాయం అందిస్తాయని భరోసా ఇచ్చారు. రైతులే మిల్లులు ఏర్పాటు చేసుకుని సనుగుల బియ్యం అనే పేరుతో మార్కెట్‌లో అమ్మేస్థాయికి ఎదగాలని తెలిపారు. కిష్టంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు ఈ సందర్భంగా కోరగా, ఎమ్మల్యే సానుకూలంగా స్పందించారు. ఇటీవల వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించినట్లే, సహకార సంఘాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సనుగుల సర్పంచ్‌ లింగంపల్లి కమలాకర్‌, ఎంపీటీసీ మాదాసు వేణు, చైర్మన్‌ అభ్యర్థి జలగం కిషన్‌రావు, రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ డప్పుల అశోక్‌, టీఆర్‌ఎస్‌ నేతలు మ్యాకల ఎల్లయ్య, భైరగోని రమేశ్‌, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


భూ నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తాం..

కోనరావుపేట: వేములవాడ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైగా సాగు నీరందబోతున్నదని, వచ్చే వానకాలంలోగా మల్కపేట రిజర్వాయర్‌ పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పునరుద్ధాటించారు. మండలంలోని మల్కపేట రిజర్వాయర్‌ అభివృద్ధి పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం రమేశ్‌బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేస్తున్నారని కోనియాడారు. రాబోయే రోజుల్లో మల్కపేట రిజర్వాయర్‌ రైతులకు వరప్రదాయినిగా మారబోతుందని, తద్వారా లక్ష ఇరువై ఐదు వేలకు పైగా ఎకరాలకు సాగునీరందనుందని, మూడు పంటలను సాగు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ నిర్వసితుల త్యాగం వెలకట్టలేదని, వారిలో ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చేపల పెంపకంతో పాటు ఇతర పనులను చేసుకోవడానికి సబ్సిడీ పథకాలను అమలు చేస్తామని, అంతేకాకుండా 50కుటుంబాలకు డుబుల్‌ బెడ్‌ రూంలు నిర్మిస్తామని హామీఇచ్చారు. అలాగే కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ చలిమెడ రాజేశ్వర్‌రావు ఫిషరీష్‌ కార్పొరేషన్‌ నిర్మించేలా కృషి చేయాలన్నారు. అనంతరం రిజర్వాయర్‌ మ్యాప్‌ను పరిశీలించగా అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.


సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ

అనంతరం మల్కపేట గ్రామంలో ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.25లక్షలు, కేవీపీ రాంచంద్రరావు రూ.25లక్షలు నిధులు కేటాయించగా సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలో పల్లెలు ప్రగతి బాటపట్టాయని వివరించారు. ప్రతి గడపగడపకు సీసీ రోడ్ల నిర్మాణం చేసి ప్రజల కష్టాలను తీర్చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చలిమెడ రాజేశ్వర్‌రావు, ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సెస్‌ డైరెక్టర్‌ తిరుపతి, వైస్‌ఎంపీపీ సుమలత, సర్పంచ్‌ ఆరె లత, ఉపసర్పంచ్‌ అంజయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి నాయకులు పాల్గొన్నారు.


logo