ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 08, 2020 , 03:48:25

మానవత్వం మాయం..

మానవత్వం మాయం..

నగల కోసం పట్టపగలు గొంతు నులిమి మహిళ హత్య.. క్షుద్రపూజలకు మూసీ నదిలో వ్యక్తి బలి.. వివాహేతర బంధం కారణంగా మాటు వేసి యువకుడిపై కత్తులతో దాడి.. మతి స్థిమితం లేక బండ రాయితో భర్త హత్య.. రోకలిబండతో కొట్టి మారు తల్లితోపాటు చెల్లెలు హత్య.. ఊహించడానికే అతి భయానకమైన ఈ దారుణ ఘటనలన్నీ ఈ నెలలోనే జరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లా అంతటా చోటు చేసుకున్న ఈ సంఘటనలు.. మంట గలుస్తున్న మానవత్వాన్ని చాటుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం మునుగోడు మండలంలోని ఎల్గలగూడెంలో సొంత కూతురినే తల్లి లక్ష్మమ్మ, అన్న గోవర్ధన్‌ హత మార్చేందుకు ప్రయత్నించారు. రోజుకో ఘటన చొప్పున నెత్తురు ఏరులై పారుతున్న తీరు.. ఉమ్మడి జిల్లా వాసులను విస్మయానికి గురి చేస్తోంది.

  • ఉమ్మడి జిల్లాలో వరుసగా దారుణ హత్యలు
  • ఈ నెల తొలి వారంలోనే ఐదు ఘటనలు
  • దారుణంగా ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు
  • ఆస్తి, పాత కక్షలు, క్షుద్ర పూజలే కారణాలు
  • మంట గలుస్తున్న మానవత్వంపై విస్మయం

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఫిబ్రవరి తొలి వారంలోనే ఉమ్మడి జిల్లాలో ఆరు దారుణ హత్యలు జరిగాయి. ఈ వారంలో ఇప్పటికి గడిచింది ఏడు రోజులే అయినా ఆరు దారుణ ఘటనలు జరగ్గా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం మునుగోడు మండలం ఎలగలగూడెంలో జరిగిన మరో దారుణ ఘటనలో తీర్పారి కవిత అనే యువతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. తన పెళ్లికి ఇవ్వాల్సిన కట్న కానుకల విషయంలో తల్లిదండ్రులు, అన్నతో జరుగుతున్న ఘర్షణలే కవితపై రాయితో వాళ్ల దాడికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కవిత చికిత్స పొందుతుండగా.. దాడి చేసిన తల్లి లక్ష్మమ్మ, అన్న గోవర్ధన్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు ముందు కూడా ఉమ్మడి జిల్లాలో ఈ నెలలోనే మరో ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. 


ఒకటో తేదీన ఆలేరు పట్టణంలో నగల కోసం పట్ట పగలే మహిళ హత్యకు గురికాగా.. నాలుగో తేదీన శాలిగౌరారం మండలంలో గురజాల గ్రామానికి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. క్షుద్ర పూజల కోసమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. హాలియా సమీపంలో ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున యువకుడిని మాటు వేసి మరీ కత్తులతో నరికి చంపారు. వివాహేతర సంబంధంతో మొదలైన పాత కక్షలే ఇందుకు కారణమని సమాచారం. 


ఆ వెంటనే 5వ తేదీ తెల్లవారుజామున చివ్వెంల మండలం మోదిన్‌పురంలో మతిస్థిమితం లేని భార్య తన భర్తను రాయితో కొట్టి చంపింది. ఆరో తేదీ సుర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్‌లో మారు తల్లి, చెల్లెలును.. మొదటి భార్య కొడుకు, అక్క ఇద్దరూ కలిసి రోకలి బండతో కొట్టి చంపారు. వరుస ఘటనల్లో నెత్తుటి దారలు పారించిన ఈ ఘటనలన్నీ జిల్లా ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. రోజుకో చోట వెలుగు చూస్తున్న దారుణం.. మానవత్వం పూర్తిగా మాయమైన స్థితిని చాటుతోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసమో.. పాత కక్షల నేపథ్యమో.. మనిషిని తోటి మనిషి చంపుకునే ఈ విష సంస్కృతి వేళ్లూనుకోకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 


పట్ట పగలే దొంగల చేతిలో మహిళ హత్య...

ఆలేరు పట్టణంలోని క్రాంతి నగర్‌లో ఈ నెల ఒకటో తేదీన దారుణ హత్య జరిగింది. మంచి నీళ్లు అడుగుతూ పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. నీలం నీలమ్మ(50)ను గొంతు నులిమి హత్య చేశారు. మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలతో పారిపోయారు. జల్సాలకు అలవాటుపడిన ఎడ్ల భాస్కర్‌ రెడ్డి అనే వ్యక్తి నగల కోసం తనకు దూరపు బంధువైన నీలమ్మను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుణ్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 


రోకలిబండతో.. మారు తల్లి, చెల్లెలు హత్య...

సూర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్‌లో ఈనెల 6న తెల్లవారుజామున తల్లీ, కూతురు దారుణ హత్యకు గురయ్యారు. తన భర్త కప్పల నాగయ్య మొదటి భార్య, తన సొంత అక్క అయిన కప్పల అచ్చమ్మ, ఆమె కొడుకు కప్పల హరీష్‌.. ఇద్దరూ కలిసి రెండో భార్య అంజమ్మ(38), ఆమె కుమార్తె(18) మౌనికను రోకలి బండతో మోది చంపారు. ఘటన అనంతరం తల్లీ కొడుకు ఇద్దరూ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆస్తితోపాటు అంజమ్మ ప్రవర్తన హత్యకు కారణంగా తెలుస్తోంది. 


మూసీ నదిలో క్షుద్రపూజలకు వ్యక్తి బలి..! 

శాలిగౌరారం మండలం గురజాలకు చెందిన మత్స్యకార్మికుడు వెంపటి శంకర్‌(50) గత నెల 31న అదృశ్యం కాగా.. ఈ నెల 4న గ్రామ సమీపంలోని ఇసుక దిబ్బల్లో మృతదేహం లభించింది. ఘటనా స్థలానికి సమీపంలోనే క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో.. శంకర్‌ను క్షుద్రపూజల కోసం బలి ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో గురజాలకే చెందిన నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 


తెల్లవారుజామున మాటు వేసి దాడి.. 

అనుముల మండలం హజారిగూడెం సమీపంలో ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున హాలియాకు చెందిన యువకుడు శిర్సనగండ్ల రేవంత్‌ కుమార్‌ (25) దారుణ హత్యకు గురయ్యాడు. హాలియా నుంచి పాలు పట్టడానికి పాలు పట్టడానికి వెళ్తున్న రేవంత్‌ కుమార్‌పై హజారిగూడెం స్టేజీ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి చంపేశారు. వివాహేతర సంబంధం కారణంగా గతంలో ఉన్న పాత కక్షలే హత్యకు కారణంగా తెలుస్తోంది. 


నిద్రిస్తున్న భర్తను బండరాయితో కొట్టి..  

ఆరుబయట నిద్రిస్తున్న భర్తను బండరాయితో భార్య కొట్టి చంపిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మోదిన్‌పురంలో ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి జరిగింది. 2016 నుంచి మతిస్థిమితం సరిగ్గా లేక చికిత్స పొందుతున్న కాకి ఇందిర.. రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న తన భర్త కాకి వెంకటరెడ్డి (48)పై బండరాయితో కొట్టడంతో అతను మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   


logo