మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 07, 2020 , 02:45:04

యాసంగి సాగు @1,16,368హెక్టార్లు

యాసంగి సాగు @1,16,368హెక్టార్లు
  • మరో 10వేల హెక్టార్లు పెరిగే అవకాశం
  • గోదావరి, కృష్ణా, మూసీ జలాలతోనే సాధ్యం
  • గత నాలుగేళ్లలో ఇదే రికార్డు
  • అత్యధికంగా 1,13,032హెక్టార్లలో వరి..

సూర్యాపేట, నమస్తేతెలంగాణ :  సాధారణంగా వర్షాకాలంలో సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. కానీ ఈసారి జిల్లాలో యాసంగి సాగు వర్షాకాలానికి దీటుగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం కృష్ణా, గోదావరి, మూసీజలాలే. ఈ మూడు నదుల జలాలు జిల్లాలో నిరాటంకంగా ప్రవహిస్తుండడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1,16,368 హెక్టార్లు సాగు చేయగా మరో 10హెక్టార్లు పెరిగే అవకాశం ఉంది. అత్యధికంగా వరి 1,13,032హెక్టార్లలో సాగు చేశారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున యాసంగిలో సాగు చేయడం గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఇదే ప్రథమం. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి సరిపడా నీటి వసతి కల్పించడమే కాకుండా 24గంటల విద్యుత్‌,  సరిపడా ఎరువులు, పెట్టుబడి సాయం అందజేస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. 


సాధారణంగా వర్షాకాలంలో పంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉం టుంది. కానీ ఈ ఏడాది జిల్లాలో వానకాలం సాగుకు దీటుగా యాసంగిలో రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు. గత వానకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1.30లక్షల హెక్టార్లకు పైగా రైతులు వివిధ పంటలు వేయగా అందులో అత్యధికంగా 1.25లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. వాస్తవానికి వానకాలం సాగు కన్నా యాసంగిలో 20 నుంచి 30వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం తగ్గుతుంది. కానీ ఆ పరిస్థితికి భిన్నంగా సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1, 16,368హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేయగా ఇంకా 10వేల హెక్టార్ల సాగు పెరిగే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా సాగైన పంటల్లో అత్యధికంగా 1,13,032హెక్టార్లలో వరి సాగు చేయగా మిగిలిన 3వేలకు పైగా హెక్టార్లలో మిగతా పంటలు వేశారు. 


మూడు నదుల ప్రవాహంతోనే.. 

త్రివేణి సంగమంలా జిల్లాలో మూడు నదుల ప్రవాహంతోనే వ్యవసాయం కళకళలాడుతోంది. సెప్టెంబర్‌ నుంచి కృష్ణానది నీరు సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలతోపాటు సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్‌పహాడ్‌ మండలంలోని పంటలకు నీరు అందుతుంది. వానకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందగా యాసంగి సైతం నీరు పూర్తిస్థాయిలో వస్తోంది. ఇక తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల వరప్రదాయిని ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు మూడు నియోజకవర్గాల్లో ప్రవహిస్తున్నాయి. సుమారు 110రోజుల నుంచి జిల్లాలో గోదావరి జలాలు నిరాటంకంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకు 456 చెరువులు నింపగా మొత్తం 22టీఎంసీల నీరు జిల్లాకు చేరింది. మూసీ కాల్వల ద్వారా నీటి విడుదలతో సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు కాల్వల ద్వారా 62,599హెక్టార్లు, చెరువుల కింద 5,086 హెక్టార్లు, బోరుబావుల కింద మరో 48వేల హెక్టార్లలో సాగు చేశారు.  


logo