బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 06, 2020 , 02:33:19

వైభవంగా సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం

వైభవంగా సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం

పెన్‌పహాడ్‌ : మండలంలోని గాజులమల్కాపురం గ్రామస్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న గిరిజనుల ఆరాధ్యదైవాలు, వనదేవతలు శ్రీసమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. 16ఏండ్ల క్రితం అమ్మవార్లను ప్రతిష్ఠించిన నారబోయిన సోమయ్య-శంకరమ్మ దంపతుల (పూజారి కృష్ణంరాజు)ఇంటి నుంచి కుంకుమ బరిణెను భజనలు, కోలాటాలు, బ్యాండు మేళాలు, శివసత్తులు, యువత నృత్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి గ్రామ శివారులోని గద్దెపై ప్రతిష్ఠించడంతో జాతర ప్రారంభమైంది. ఈసందర్భంగా ఇంటికో బోనం, పసుపు కుంకుమ, గాజులు, యాటలు, కోళ్లు, బంగారం(బెల్లం)తో భక్తులు భారీగా గ్రామ శివారులోని గద్దె వద్దకు తరలివచ్చారు. అమ్మవార్లను గద్దె మీద ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. మండలం నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఆటోలు, ఎండ్ల బండ్లల్లో భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. అమ్మవార్లకు నెలువెత్తు బంగారం(బెల్లం)  సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అమ్మవార్ల దర్శనం తరువాత గద్దెపక్కనే కొలువుదీరిన నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నిసౌకర్యాలు కల్పించారు.   


నేడు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రాక..

సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా వనదేవతలను దర్శించుకునేందుకు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విచ్చేయనున్నట్లు స్థానిక సర్పంచ్‌ బండి ధనమ్మారామకృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ నాతాల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నేడు ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి కబడ్డీ, మహిళా కోలాటం, క్రికెట్‌ పోటీలను మంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు.  


logo