శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 06, 2020 , 02:27:44

సీఎం కేసీఆర్‌తోనే ఆదర్శవంతమైన పాలన

సీఎం కేసీఆర్‌తోనే ఆదర్శవంతమైన పాలన

తిరుమలగిరి నమస్తేతెలంగాణ : సీఎం కేసీఆర్‌తోనే ఆదర్శవంతమైన పాలన సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీకి అఖండ విజయాలు అందిస్తున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలగిరి మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. దేశానికే ఆదర్శంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతూ అటూ అభివృద్ధిలోనూ, ఇటు ఎన్నికల ఫలితాల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రికార్డులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో టీఆర్‌ఎస్‌ సృష్టించిన అద్భుతాలు బహుషా ఏ పార్టీకి సాధ్యం కావన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఎవ్వరూ ఊహించని విధంగా సాగునీరు అందించి రికార్డు సృష్టిస్తున్నారన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ ఇస్తూ సాగునీరు కూడా అందించి వ్యవసాయం పండుగలా మార్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అన్నారు. గ్రామాలు ఆదర్శవంతంగా ఉండాలన్న సదుద్దేశంతో ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతి చేపట్టారన్నారు. మున్సిపాలిటీ పాలక వర్గం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎవ్వరూ పోటీలేని విధంగా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమిష్టి కృషితో పనిచేసి మున్సిపాలిటీ రూపురేఖలు మార్చాలని మంత్రి సూచించారు.  

 

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే  

అభివృద్ధి సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అపూర్వమైన మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన అందించానని, తిరుమలగిరి మున్సిపాలిటీగా మారడంతో అభివృద్ధి జరిగి పట్టణం సుందరీకరణంగా మారుతుందన్నారు. మంత్రి సహకారంతో రాబోయే రోజుల్లో మరెంతో అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు   కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్‌ పోతరాజు రజిని, వైస్‌ చైర్మన్‌ సంకెపల్లి రఘునందన్‌రెడ్డికి బాధ్యలు అప్పగించారు. కార్యక్రమానికి ముందు టీఆర్‌ఎస్‌ శ్రేణులు అనంతారం నుంచి  మున్సిపాలిటీ కార్యాలయం వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే  కిశోర్‌ను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, ఉన్నత విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత,టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


logo