శుక్రవారం 03 జూలై 2020
Suryapet - Feb 05, 2020 , 02:22:22

నేటి నుంచి ‘గాలికుంటు’ టీకాలు

నేటి నుంచి ‘గాలికుంటు’ టీకాలు

సూర్యాపేట అర్బన్‌ : తెలంగాణను గాలికుంటు వ్యాధి నివారణరహిత రాష్ట్రంగామార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఉచితంగా పశువులకు టీకాలను అందిస్తూ వస్తున్నది. దానిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గాలి కుంటు టీకాలను అదించేందుకు శ్రీకారం చుట్టింది. పశువుల రవాణాలో ఎదురవుతున్న సమస్యలనను పరిష్కరించేందుకు ఆన్‌లైన్‌ చేయనున్నారు. తద్వారా పశువుల వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రతి పశువుకు ఒక నెంబర్‌.. 

టీకాలను వేయడం వల్ల ఉన్న ప్రయోజనాన్ని గుర్తించిన ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి పశువుకు బార్‌కోడ్‌తో కూడిన విశిష్ట నెంబర్‌ను కేటాయించనున్నారు. ఫలితంగా పశువుల సమాచారం అందుబాటులో ఉండడంతోపాటు టీకాలు వేయించింది లేనిది గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. టీకాలు వేసిన ప్రతి పశువు చెవికి ఒక నెంబర్‌తో కూడిన ట్యాగ్‌ను వేయనున్నారు.

121 బృందాల ఏర్పాటు.. 

పశువులకు వచ్చే వ్యాధులను శాశ్వతంగా నివారించేందుకు నెలరోజులపాటు టీకాలు అందించేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది 230 మందితోపాటు, మరో 12 మందిని తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేశారు. 121 బృందాలుగా వీరు టీకాలు వేయనున్నారు. తాత్కాలికంగా నియమించిన సిబ్బందికి ప్రతి టీకాకు రూ.3 ఇవ్వనున్నారు.

టీకాలు వేస్తేనే అమ్మకాలు, ఉత్పత్తులకు గిరాకీ..

 రైతులు వారి అవసరాలకు అనుగుణంగా సంతల్లో పశువుల అమ్మకాలు, కొనుగోలుకు రానున్న రోజుల్లో టీకాలు వేయించిన పశువులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీనికోసం ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు టీకాలు వేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అమ్మకాలతోపాటు దేశ అంతర్జాతీయ స్థాయిలో పశువుల ఉత్పత్తులైన పాలు, పెరుగు, వెన్న, జున్నులాంటి వాటికి గిరాకీ పెరుగనున్నది.

ఫిబ్రవరి 5 నుంచి నెల రోజులు  

ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం జిల్లాలో ఫిబ్రవరి 1 నే టీకాల కార్యక్రమం ఉన్నప్పటికీ టీకాలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో ఫిబ్రవరి 5 నుంచి మార్చి 5 వరకు కొనసాగించనున్నారు. టీకాలు వేసే సిబ్బంది రైతులకు సమాచారం అందించి ఇచ్చిన సమయానికి టీకాలను ఉదయం 11 గంటల లోపు పశువులకు వేస్తారు. గాలి కుంటు నివారణ కోసం ప్రభుత్వం రైతులు నిరాకరించకుండా టీకాలు వేయించాలి, లేకపోతే నిర్బంధంగా పశువులకు టీకాలు వేయనున్నారు.

టీకాలతో ఎటువంటి సమస్యలు ఉండవు 

పశువులకు ప్రభుత్వం అందిస్తున్న టీకాల వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. అలాంటి అపోహలను నమ్మి టీకాలను వేయించడం మరిచిపోవద్దు. టీకాలు వేయకపోవడం మూలంగా ఆరోగ్యంగా ఉండే పశువులకు వ్యాధులు సోకే అవకాశం ఉంది. టీకాలను వేయించడంలో ప్రజాప్రతినిధులు, పశుపోషకులు సహకారం అందించి గాలికుంటు శాశ్వత నివారణకు కృషి చేయాలి.

-వేణుమనోహర్‌రావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి, సూర్యాపేట


logo