బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 05, 2020 , 02:15:26

నేటి నుంచి ఫణిగిరి జాతర

నేటి నుంచి ఫణిగిరి జాతర

హుజూర్‌నగర్‌, నమస్తేతెలంగాణ : హుజూర్‌నగర్‌ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో గట్టుపై వేంచేసి ఉన్న ఫణిగిరి రామచంద్రస్వామికి దేవాలయానికి 900 సంవత్సరాల చరిత్ర, గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయానికి సుమారు  1000 సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తుంది. పోచంచర్ల గ్రామ సమీపంలో బంగారు కోవెలను ఎర్పాటు చేసుకుని భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఫణిగిరి గట్టుపై ప్రతి సంవత్సరం మాఘశుద్ధ్య పౌర్ణమిన బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహోత్సవాలను తిలకించేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. స్వామి వారి ధ్వజారోహణ సమయంలో గరుడ ముద్దను స్వీకరించిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. నేటి నుంచి ఫణిగిరి గట్టుపై జాతర ప్రారంభమై 13న ముగుస్తుంది. 

9 రోజుల పాటు జాతర

5 నుంచి 13 వరకు 9 రోజుల పాటు బ్రహోత్సవాలు కొనసాగనున్నాయి. 5న అధ్యయన ఉత్సవం ప్రారంభం, 6న ద్రావిడ వేదపారాయణం, తీర్ధప్రసాద వినియోగాలు, 7న రాత్రికి పరమపదోత్సవం, 8న కల్యాణమునకు స్వామి వారిని పెళ్లి కుమారుని చేయడం, రాత్రికి స్వామి వారిని పట్టణం నుంచి గట్టు వద్దకు చేర్చడం, ధ్వజారోహణం, గరుడముద్ద అందుకొనుట, 9న స్వామి వారికి ఎదుర్కొలు, కల్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ, 10న హోమ బలిహారము, అన్నప్రసాద వితరణ, ఎద్దుల పందేలు, 11న హోమం, బలిహారం, రాత్రికి దోపు ఉత్సవం, 12న రాత్రికి పట్టణ ప్రవేశం, పురవీధుల్లో స్వామి వారి ఊరేగింపు, ఆలయ ప్రవేశం, 13న ఉదయం ప్రాభోధికి నివేదన, పవళింపు సేవలతో కార్యక్రమాలు ముగుస్తాయి. 9 రోజుల పాటు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ధర్మకర్త, చైర్మన్‌ జగన్నాథాచార్యులు తెలిపారు.  కల్యాణం రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందనీ,  ఆర్టీసీ వారు గుట్ట వరకు బస్సులను నడపనున్నారని తెలిపారు.


logo