శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 03, 2020 , 03:02:30

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

నార్కట్‌పల్లి : ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున పార్వతీజడల రామలింగేశ్వరుల కల్యాణోత్సవం అత్యంత వైభోవోపేతంగా జరిగింది. లక్షలకు పైగా తరలి వచ్చిన భక్తులతో చెరువుగట్టు క్షేత్రం కిక్కిరిసింది. ప్రభుత్వం తరుపున నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపార్వతమ్మ దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఓం నమః శివాయా అంటూ భక్తులు శివనామా స్మరణలతో శివ సత్తుల కోలాటాల మధ్య ఉత్తరాయణ పుణ్యకాలం, నాగమాస శుద్ధ సప్తమి (రథసప్తమి) గడియలలో యాజ్ఞికులు అల్లవరపు సుబ్రమణ్య దీక్షితావధాని ఆచార్యత్వంలో ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు నీలకంఠ శివాచార్యుల వ్యాఖ్యానం కట్టి పడేస్తుండగా రుత్వికుల వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణతంతు శైవాగామోత్కంగా జరిగింది. అంతకు ముందు తెల్లవారుజామున 2 గంటల నుంచే సుప్రభాత సేవ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం, అన్నాభిషేక మహానివేధనం నిర్వహించి ఉదయం 4.30 గంటలకు మేలతాళాలతో స్వామి వారిని నంది వాహనంపై.. అమ్మవారిని గజ వాహనంపై ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపానికి స్వాముల వారిని తోలుకొని వచ్చారు. సువర్ణ పుష్పాది బిల్యాయలతో దివ్యలంకరణతో శోభితమైన కల్యాణ వేదికలో పద్మాసనంపై ఉత్సవ మూర్తులు ఆసీనులు గావించి సప్తనది జలాలతో కూడిన మంత్రజలాన్ని చల్లి కల్యాణ వేదికను శుద్ధిచేసి బ్రహ్మ, విష్ణువు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం కల్యాణ మండపంవద్ద సాంప్రదాయబద్ధంగా విఘ్నేశ్వరపూజ పుణ్య వాహచనం, రక్షాసూత్రాధరణ, 5.20 గంటలకు జిలకర్ర బెల్లం పెట్టించారు. అమ్మవారికి రక్షా సూత్రాధరణ చేశారు. జగత్‌ రక్షక్షుడైన పరమేశ్వరుడి గొప్పతనం వృత్తాంతాన్ని వివరించి మాంగళ్యం తంతుణానే లోకరక్షణాహేతునాం.. అంటూ యాజ్ఞికులు మంత్రాలు పటిస్తుండగా 5.50 గంటలకు త్రినేత్రుడు పార్వతీ అమ్మవారికి మాంగళ్యధారణ చేసే ఘట్టాన్ని భక్తులు తనివి తీర తిలకించి పునీతులయ్యారు. పరిణయ శోభతో మనోహరంగా దర్శనమిచ్చిన ఆది దంపతులకు తలంబ్రాలను సమర్పించుకున్న భక్తులతో వేదిక కిక్కిరిసింది.  దాదాపు 200 క్వింటాళ్ల పసుపు బియ్యం తలంబ్రాల రూపంలో సమకూరాయి. స్వామి కల్యాణంకు రూ.4,20,830 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్‌, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి దంపతులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు ఆలయ ఈఓ సులోచన ఘనస్వాగతం పలికారు.


శివనామస్మరణతో మార్మోగిన గట్టు 

పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలు మూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి 2లక్షలకు పైగా భక్తులు తరలి వచ్చా రు. గట్టుపై కాకుండా గట్టు కింది నుంచి ఘాట్‌రోడ్డుకు ఇరువైపుల భక్తులతో కిక్కిరిసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక వసతులు కల్పించినట్లు ఈఓ సులోచన, ఆల య అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. స్వామి వారి దర్శనం కల్పిస్తూ తలంబ్రాల బియ్యం పోసేలా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌లు పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్గ బాలకృ ష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, ఎంపీడీఓ సాంబశివరావు, తాసిల్దార్‌ రాధ, నార్కట్‌పల్లి సర్పంచ్‌ దూ దిమెట్ల స్రవంతివెంకటేశ్వర్లు, పుల్లెంల ముత్తయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


చెర్వుగట్టుకు రూ.21,63,230 ఆదాయం

శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్శిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం రోజు ఆదా యం మొత్తం  రూ.21,63,230 వచ్చినట్లు ఈఓ సులోచన తెలిపారు. స్వామివారి ఆర్జిత సేవల కింద రూ. 2,12,400, లడ్డూ, పులిహోర తదితర ప్రసాదాల అమ్మకాలతో రూ.12,50,000, కల్యాణ టికెట్ల అమ్మకం ద్వారా రూ.2,80,000, కల్యాణం హుండీ ద్వారా రూ. 4,20,830 మొత్తం కలిపి రూ.21, 63,230 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 


logo