సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 03, 2020 , 02:54:47

శ్రీరామునిగా.. వైకుంఠనాథునిగా శ్రీలక్ష్మీనరసింహుడు

 శ్రీరామునిగా.. వైకుంఠనాథునిగా శ్రీలక్ష్మీనరసింహుడు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలో ఆదివారం ఉదయం శాంతమూర్తి అయిన శ్రీరాముని అలంకారంలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చిన ఉగ్రనరసింహుడు రాత్రి వైకుంఠనాథుడిగా దర్శనభాగ్యం కల్పించారు. వేదమూర్తుల వేదపఠనం ఒక వైపు.. సన్నాయిమేళాల సందడి మరో వైపు కొనసాగుతుండగా శ్రీవారిసేవలో శ్రీలక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చి ఆనందం కలిగించారు. జగద్రక్షణ కోసం శ్రీరామునిగా, వైకుంఠనాథునిగా శ్రీమన్నారాయణుడు చేసిన విశేషములను ప్రధానార్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు బట్టర్‌ సురేంద్రాచార్యులు వివరించారు. అంతకుముందు శ్రీస్వామి వారి ఆయంలో నిత్యారాధనలు జరిపారు. ఆళ్వారాదుల దివ్య ప్రబంధ పాశురములను పారాయణీకులు నిర్వహించారు. 

శ్రీరామావతార విశిష్టత.. 

జగద్రక్షణార్థము అవతరించిన అన్ని అవతారాల్లో అత్యంత మనోహరమైన అవతారము శ్రీరామావతారము. నారదమహర్షి వాల్మీకి భగవానునికి శ్రీరామచంద్రుని కల్యాణగుణములను చెబుతూ ధర్మజ్ఞుడని, జితేంద్రియుడని, సత్యసంధుడని, ప్రజలహితము కోరువాడని చెప్పడం ద్వారా శ్రీరామచంద్రుని అవతార వైభవం గురించి తెలుస్తున్నది. పురుషోత్తముడే ఉత్తమ మానవుడిగా, ఈ లోకములో అవతరించి పితృవాక్య పరిపాలన కోసం అరణ్యవాసం చేసి భార్యవియోగము పొంది దుఃఖములు అనుభవించి మానవుని నడవడికను చూపించిన దివ్య అవతారమే శ్రీరామ అవతారము.  రాత్రి శ్రీస్వామి వారి ఆలయంలో నిత్య కైంకర్యములను నిర్వహించిన అర్చకులు శ్రీవారిని వైకుంఠనాథునిగా అలంకరించి తిరువీధుల్లో భక్తుల దర్శనం కలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్‌.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయాధికారులు జూశెట్టి కృష్ణగౌడ్‌, ఉప ప్రధానార్చకులు బట్టర్‌ సురేంద్రాచార్యులు, ఆలయ పర్యవేక్షకులు బలరాం, ముఖ్య అర్చకులు  కొడకండ్ల మాధవాచార్యులు పాల్గొన్నారు.  


logo