శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Jan 31, 2020 , 01:40:09

జాతరకు వేళాయే

జాతరకు వేళాయే
  • బ్రహ్మోత్సవాలకు చెరువుగట్టు ముస్తాబు
  • 500మంది పోలీసులతో బందోబస్తు..
  • ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అభివృద్ధి కమిటీ
  • లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
  • ఆదివారం తెల్లవారుజామున కల్యాణం
  • ఫిబ్రవరి 1నుంచి 6వరకు ఉత్సవాలు


జాతరలో భాగంగా నిర్వహించే రామలింగేశ్వరుని కల్యాణం, అగ్ని గుండాలు, హంస వాహన సేవను తిలకించేందుకు భక్తులకు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంటుందని, వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశానుసారం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్‌ రోడ్డు వద్ద, గుట్ట కింద తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలను ప్రారంభించేందుకు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ముఖ్యఅతిథులుగా రానున్నట్లు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆలయ ఈఓ సులోచన తెలిపారు.


ఆరు రోజుల జాతర

ఫిబ్రవరి 1న ఉదయం 10 గంటలకు బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. అదే రోజు రాత్రి (తెల్లవారితే ఆదివారం 2వ తేది) స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. 2న సాయంత్రం 6 గంటలకు గట్టుపైన కోనేటి పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లను హంస వాహనంపై ఉంచి తెప్పోత్సవం, 3వ తేదీ తెల్లవారుజామున శేష వాహన సేవ 4వ తేదీ తెల్లవారుజామున 4గంటలకు అగ్ని గుండాలు, రాత్రి పర్వత వాహన సేవ, దోపోత్సవం, అశ్వవాహన సేవ జరుపుతారు. 5న రాత్రి పుష్పోత్సవం ఏకాంత సేవలు, 6న సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవంతో  బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 


భక్తుల కడగండ్లు తీర్చే మూడు గుండ్లు

కైలాసాన కొలువై ఉన్న శివుడు భూలోకంలో చెరువుగట్టు సమీపంలోని అతి ఎత్తైన మూడు గుండ్లపై వెలిశాడని.. ఈ మూడు గుండ్లు ఎక్కి దర్శించే భక్తుల సమస్త కోరికలు తీర్చుతాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు మూడు గుండ్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం సమస్త పాప భీతి, కష్టాలు, కల్మషాలు పోయి తమకు శారీరక, మానసిక క్షీనతలు పోయి ఆరోగ్యవంతులుగా, సిరి సంపదలతో ఉంటామని భక్తులు నమ్ముతారు. రామలింగేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడుతూ గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉంటారు. స్వామివారికి క్షీరాభిషేకం చేసి ఆ పాలను తమ వెంట తీసుకెళ్తారు. వీటితో తమ గ్రామంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకం.  


ప్రాచుర్యం పొందిన ఆరోగ్య క్షేత్రం

చెరువుగట్టు ఆరోగ్య క్షేత్రంగా కూడా ప్రాచుర్యం పొందింది. మానసిక రుగ్మతలతో బాధపడే వారు ఈ క్షేత్రంపై మండల దీక్ష చేసి స్వామి వారిని సేవిస్తే అనారోగ్యం మాయమై సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని విశ్వాసం. స్వామి వారి ఆలయం సమీపంలోని ఓ చెట్టుకు మొక్కుబడి కింద ముడుపులు చెల్లించి స్వామి వారి పాదాల వద్ద తమ తమ కోరికలు తెలియజేస్తూ.. తమ ఆరోగ్యం మెరుగు పడాలని కోరుకుంటూ స్వామి పాదుకలను తమ శిరస్సు పైన పెట్టుకొని 11 లేక 21 లేదా 41 ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామివారిని దర్శిస్తుంటారు.  


భారీ బందోబస్తు

చెరువుగట్టు జాతర కోసం పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. గుట్ట పైన, కింద రెండు ఔట్‌పోస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. 15 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 100 మంది ఏఎస్‌ఐలు, 325 మంది కానిస్టేబుళ్లు మొత్తం 500 మంది బందోబస్తులో పాల్గొంటారు. గుట్ట పైకి వృద్ధులు, చిన్న పిల్లలను చేరవేసేందుకు 5 ఆటోలను మాత్రమే అనుమతిస్తారు. సీసీ కెమెరాల ద్వారా నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించేందుకు 2 ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 2 డ్రోన్‌ కెమరాలతో గుట్టపై భద్రతను ఎప్పటికప్పుడు పర్చవేక్షిస్తామని ఎస్పీ రంగనాధ్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు.


మహిమ గల క్షేత్రం చెరువుగట్టు 

చెరువుగట్టు చాలా మహిమ గల క్షేత్రం. ఇక్కడ కొలువైన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అత్యంత మహిమాన్వితుడు. భక్తులు బిందెడు నీళ్లతో అభిషేకించి దేవరా పాహిమాం.. అంటే కరుణించి వారి కోరికలు తీర్చే సంపన్నుడు. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి స్మరించుకుంటే సకల సంపదలు లభిస్తాయి.

- పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఆలయ ప్రధానార్చకుడు


logo