మంగళవారం 02 జూన్ 2020
Suryapet - Jan 30, 2020 , 00:40:57

ఎరువులు పుష్కలం

ఎరువులు పుష్కలం

యాసంగికి ఎరువుల కొరత లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సబ్సిడీపై సరిపోను విత్తనాలను పంపిణీ చేసిన అధికారులు ఎరువులను కూడా సిద్ధం చేశారు. జిల్లాలో లక్షా20 వేల హెక్టార్లలో వరితోపాటు పలు రకాల పంటలు సాగుచేస్తారని అంచనా వేయగా.. 37 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమవుతాయని ప్రతిపాదనలు చేశారు. పీఏసీఎస్‌, గ్రోమోర్‌, ఆగ్రోస్‌ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించిన 16 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులకు పంపిణీ చేయగా.. మరో 9 వేల మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌ను అందుబాటులో ఉంచారు. రైతుల అవసరాన్ని బట్టి ఎరువులను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

  • యాసంగికి సిద్ధం చేసిన అధికారులు
  • ఈ సీజన్‌లో 37 వేల మెట్రిక్‌ టన్నుల అంచనా
  • ఇప్పటికే 16 వేల మెట్రిక్‌ టన్నుల అందజేత
  • 9వేల మెట్రిక్‌ టన్నుల బఫర్‌
  • స్టాక్‌ అందుబాటులో..లక్షా 20వేల హెక్టార్ల పంటల సాగు..

సూర్యాపేటఅర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా యాసం గి సీజన్‌లో సరిపడానీరు ప్రాజెక్టుల ద్వారా అం దుబాటులో ఉండడంతో గతంలో ఎన్నడూ సా గు చేయని భూములను సైతం సాగులోకి తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా వరి సాగుపై రైతాంగం దృష్టి సారించింది. జిల్లా పరిధిలో వరి పంటను విరివిగా సాగు చేస్తున్నారు. పంట దిగుబడిపై ఎ టువంటి ప్రభావం పడకుండా ఉండేందుకుగాను అధికారులు రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేస్తున్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ఇప్పటికే అధికారులు ఫర్టిలైజర్‌ మానిటరింగ్‌ సిస్టంను అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా దుకాణదారులు కృత్రిమ కొరత సృష్టించకుండా వారికి కేటాయించిన ఎరువుల వివరాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో ఎరువులు నల్లబజారుకు తరలిపోకుండా ఉంటుంది.


25 వేల మెట్రిక్‌ టన్నులు సిద్ధం  

వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం 90 వేల హెక్టార్లు ఉండగా యాసంగి సీజన్‌లో లక్షా 20 వేల హెక్టార్లకు పెరిగింది. ఫలితంగా పెరిగిన సాగుకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రైతులకు 16 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను పీఎసీఎస్‌, గ్రోమోర్‌, ఆగ్రోస్‌ ద్వారా రైతులకు అందించగా.. అవసరాలను బట్టి మరో 9 వేల టన్నుల బఫర్‌ స్టాక్‌ను సిద్ధం చేసి ఉంచారు. 


జిల్లాకు 37మెట్రిక్‌ టన్నులు అవసరం 

 జిల్లాలో లక్షా 20 వేల హెక్టార్లలో సాగు చేస్తున్న పంటలకు అధికారుల అంచనాల ప్రకారం సుమారు 37 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు. వివిధ ధఫాలుగా వస్తున్న యూరియాను కొనుగోలు కేంద్రాలకు అధికారులు అందిస్తున్నప్పటికీ రైతులతా ఒకే సారి కేంద్రాలకు రావడంతో కొంత సమస్య ఏర్పడుతుంది. రైతులకు అవసరమైన యూరియాను అందించేందుకు మార్క్‌ఫెడ్‌ అధికారులు నిల్వలను సిద్ధం చేసి ఉంచారు.


యూరియా నిల్వలు సిద్ధం చేశాం 

సాగు చేస్తున్న రైతులకు కావాల్సినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నా యి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా ఎప్పటికప్పుడు విక్రయిస్తున్న వివరాలను తెలుసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం మేరకు ఎంత అవసరమైతే అంత యూరియాను పంపిస్తున్నాం. రైతులు ప్రస్తుతం అవసరమైన యూరియాను కొనుగోలుచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

 -జ్యోతిర్మయి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి -సూర్యాపేట


logo