సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 28, 2020 , 03:24:55

నేరేడుచర్లలో హైడ్రామా..

నేరేడుచర్లలో హైడ్రామా..

నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో అధికారులు ఈనెల 28కి వాయిదా వేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 27న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక కొరకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు నేరేడుచర్ల మున్సిపల్‌ కమిషనర్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక కొరకు ఓటు వేసే అర్హత కలిగిన జాబితా ప్రకటించి అభ్యర్థులకు నోటీసులు జారీచేశారు. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం మున్సిపల్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి సుందరి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందుగా టీఆర్‌ఎస్‌ నుంచి కౌన్సిలర్లుగా గెలుపొందిన 4వ వార్డు షేక్‌.బాషా, 5వ వార్డు అలక సరిత, 7వ వార్డు చందమళ్ల జయబాబు, 9వవార్డు బాణోతు లలిత, 13వ వార్డు పోరెడ్డి శ్రీలత, 14వ వార్డు వేమూరి నాగవేణి, 15వ వార్డు కుంకు సులోచనలతోపాటు ఎక్స్‌ఆఫీషియో సభ్యులు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ఉదయం 10ః30 గంటలకు క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం 10ః58గంటలకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి కౌన్సిలర్లుగా గెలుపొందిన 1వ వార్డు కొణతం చిన్న వెంకటరెడ్డి, 2వ వార్డు రణపంగ నాగయ్య, 3వ వార్డు షేక్‌.షహానాజ్‌, 6వ వార్డు తాళ్ళూరి సాయి, 10వ వార్డు నూకల సుగుణ, 11వ వార్డు బచ్చలకూరి ప్రకాశ్‌, 12వ వార్డు బైరెడ్డి జితేందర్‌రెడ్డిలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన సీపీఎం పార్టీ అభ్యర్థి 8వ వార్డు కొదమగుండ్ల సరితతోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యులైన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేవీపీ రామచంద్రరావు కార్యాలయానికి హాజరైనారు. నోటీస్‌ బోర్డుపై కేవలం కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్లు మాత్రమే నమోదు చేసి ఉన్నాయని, వీరికి మాత్రమే ఓటు వేసే అవకాశం లేనందున కేవీపీని అనుమతించమని పోలీసులు అడ్డగించారు. దీంతో ఎన్నికల కమిషన్‌ కేవీపీకి ఓటుహక్కు కల్పిస్తూ గెజిట్‌ జారీచేసిందని ఎన్నికల అధికారికి వాట్సప్‌ ద్వారా పంపిచడంతో పరిశీలించిన అధికారి వారిని అనుమతించేందుకు పోలీసులను ఆదేశించాడు. సమావేశంలో కేవీపీ రామచంద్రరావు పేరును జత చేస్తూ నూతన ఓటరు జాబితాను అధికారులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు లేనిపేర్లను ఏవిధంగా ఇందులో చేర్చారని, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సైదిరెడ్డి అధికారులపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే శానంపూడిపై దుర్భాషలాడుతూ భౌతికదాడులకు ప్రయత్నించినట్లు సమాచారం. వాతావరణం వేడెక్కడంతో అధికారులు సమావేశాన్ని ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. కోరం సంపూర్ణంగా ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యులు సభలో నానారభస సృష్టించారు. ఈదశలో ఎన్నికల అధికారులు ఎలక్షన్‌ కమిషన్‌కు పరిస్థితి వివరించారు. మొదట కాంగ్రెస్‌ ఎక్స్‌అఫిషీయోగా నమోదైన పేరును చేర్చకపోవడంతో ఆలస్యంగా చేర్చినందున ఆ ఓటరుకు సమావేశంలో పాల్గొనేందుకు సరిపడా సమయం ఇవ్వాలనే కారణంతో మధ్యాహ్నం 3గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్‌ ప్రకటించారు. వాయిదా విషయం టీఆర్‌ఎస్‌ సభ్యులకు నోటీసులు అందజేయాలని అధికారులు ప్రయత్నించగా వారు అందుబాటులో లేకపోవడంతో ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం సమావేశం నిర్వహించి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎంపిక నిర్వహించనున్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఉత్తమ్‌ : ఎమ్మెల్యే

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అరాచకాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. 11గంటల వరకు అఫీషియల్‌ ఓటింగులో లేని పేరు ఇప్పడు ఓటింగ్‌ సమయానికి ఎలా వచ్చిందన్నారు. ఎప్పుడు ఓటింగ్‌ జరిగినా అరాచకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, గతంలో చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో 7సీట్లు గెలిచిన వారిని కాదని మూడు సీట్లు గెలిచిన వారికే పదువులు అప్పజెప్పిన సంస్కృతి ఉత్తమ్‌ది అన్నారు. నిన్నటి వరకు కూడా కేవీపీ రామచంద్రరావు పేరు ఓటరు లిస్టులో లేకపోవడంతో ఈ రోజు లిస్టులో పెట్టించి ఓటుకి తీసుకురావడం ఇది ప్రజాస్వామ్యం అంటే విరుద్ధమని అన్నారు. ఎన్నికలను వాయిదా వేయడానికి ఉత్తమ్‌ నీచపు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.


logo