శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 28, 2020 , 03:20:05

ఆరు పురపాలికలపై గులాబీ జెండా

ఆరు పురపాలికలపై గులాబీ జెండా

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 7పట్టణాల్లో పురపాలక సంఘాల చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక సోమవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రం నల్లగొండతోపాటు.. మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల మున్సిపాలిటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను కాంగ్రెస్‌ దక్కించుకుంది. నల్లగొండలో కోరం లేక పోవడంతో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేటికి వాయిదా పడింది. టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్‌ నేతలు, పార్టీ విధేయులకే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను కేటాయించింది. 10 గంటల తర్వాత పార్టీల వారీగా ఆయా మున్సిపాలిటీలకు చేరుకున్న వార్డు సభ్యులు.. 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 12.30గంటలకు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోగా.. ఆ తర్వాత వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నల్లగొండలో చైర్మన్‌ ఎన్నిక అనంతరం సభ్యులు బయటికి వెళ్లడంతో కోరం లేక వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. 

     మిర్యాలగూడ 

48 వార్డులు ఉండగా.. 27 స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ నుంచి చైర్మన్‌గా తాజా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగలక్ష్మి భర్త తిరునగరు భార్గవ్‌, వైస్‌ చైర్మన్‌గా కుర్రా కోటేశ్వర్‌రావు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఇక్కడ 18స్థానాలు గెలవగా, సీపీఎం, బీజేపీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఒక్కో స్థానంలో గెలిచిన సంగతి తెలిసిందే. 

      దేవరకొండ 

 20 వార్డులకు 11 స్థానాలు గెలిచిన టీఆర్‌ఎస్‌లో మరో స్వతంత్ర అభ్యర్థి సైతం చేరడం, ఎమ్మెల్యే రవీందర్‌ కుమార్‌ ఎక్స్‌ అఫీషియో ఓటుతో టీఆర్‌ఎస్‌ బలం 13కు పెరిగింది. చైర్మన్‌గా పార్టీ సీనియర్‌ నేత ఆలంపల్లి నర్సింహ, దీంతో టీఆర్‌ఎస్‌ నుంచే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా మైనారిటీ నేత ఎండీ రహత్‌ అలీ ఎన్నికయ్యారు. ఇక్కడ కాంగ్రెస్‌ 4, బీజేపీ 3 వార్డులు గెలవగా.. స్వతంత్ర అభ్యర్థి మరో వార్డులో గెలిచారు. 

     నందికొండ 

12 వార్డు స్థానాలకు 9 స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ నుంచే చైర్మన్‌గా పార్టీ సీనియర్‌ కర్ణ బ్రహ్మానందరెడ్డి సతీమణి కర్ణ అనూష, వైస్‌ చైర్మన్‌గా మందా రఘువీర్‌ ఎన్నికయ్యారు. ఇక్కడ కాంగ్రెస్‌ 3స్థానాల్లో గెలిచింది. 

    చండూరు 

మొత్తం 10 వార్డులకు 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత తోకల వెంకన్న సతీమణి తోకల చంద్రకళ మున్సిపల్‌ చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా దోటి సుజాత ఎన్నికయ్యారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ 2, బీజేపీ 1 స్థానం గెలుచుకున్నాయి. 

    హాలియా 

మొత్తం 12 వార్డులకు 5 స్థానాల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌లో స్వతంత్ర అభ్యర్థి కూడా చేరడంతోపాటు.. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎక్స్‌ అఫీషియో ఓటుతో మొత్తం బలం 7కు చేరింది. దీంతో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత వెంపటి శంకరయ్య సతీమణి వెంపటి పార్వతమ్మ చైర్మన్‌గా.. టీఆర్‌ఎస్‌లో చేరిన స్వతంత్ర అభ్యర్థి నల్లగొండ సుధాకర్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ఇక్కడ ఆరు స్థానాలు గెలుచుకుంది. 

    చిట్యాల 

12 వార్డులకు టీఆర్‌ఎస్‌ 6 స్థానాల్లో గెలవగా.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎక్స్‌ అఫీషియో ఓటుతో టీఆర్‌ఎస్‌ బలం ఏడుకు చేరింది. చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా కూరెళ్ల లింగస్వామి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన నలుగురు సభ్యులు, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ పక్షాన గెలిచిన ఇద్దరు సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు దూరంగా ఉన్నారు. 

నల్లగొండ 

మొత్తం 48 వార్డులకు టీఆర్‌ఎస్‌ 20, కాంగ్రెస్‌ 20, బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ రెబల్‌ 1, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచింది. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ రెబల్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నేతి విద్యా సాగర్‌, తేరా చిన్నపరెడ్డి ఎక్స్‌ అఫీషియో ఓట్లతో టీఆర్‌ఎస్‌ బలం 27కు పెరిగింది. స్పష్టమైన మెజార్టీతో చైర్మన్‌ పీఠం కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సన్నిహితుడు, యువకుడు అయిన మందడి సైదిరెడ్డిని సభ్యులు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. సీపీఎంకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎక్స్‌ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నా.. పార్టీ నిర్ణయం మేరకు ఓటింగ్‌లో పాల్గొనలేదు. నేడు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుండగా.. టీఆర్‌ఎస్‌కే దక్కనుంది. టీఆర్‌ఎస్‌లో గెలిచిన వారిని వైస్‌ చైర్మన్‌ చేస్తారా? లేక చైర్మన్‌ ఎన్నికకు మద్దతు ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుంటారా? అనేది నేడు తేలనుంది.


logo