శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 27, 2020 , 04:10:45

మళ్లీ భూప్రకంపనలు

మళ్లీ భూప్రకంపనలు
  • చింతలపాలెంతోపాటు పలుప్రాంతాల్లో కంపించిన భూమి
  • రిక్టర్‌ స్కేల్‌పై 4.6 మాగ్నిట్యూడ్‌గా నమోదు
  • ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీసిన ప్రజలు
  • వంద కిలోమీటర్ల పరిధిలో తరంగాల వ్యాప్తి
  • ఈ నెల 12 నుంచి ఇప్పటివరకు 300 సార్లు
  • నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్‌, ఏపీలోనూ భూకంప ప్రభావం

చింతలపాలెం : జిల్లాలోని చింతలపాలెం, హుజూర్‌నగర్‌, గరిడేపల్లి, నేరేడుచర్ల, మేళ్లచెర్వు, మఠంపల్లి మండలాలతోపాటు నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్‌, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున 2.37గంటలకు కొన్ని సెకన్లపాటు భారీ శబ్ధాలతో భూకంపం సంభవించింది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఈ భూకంపాలకు ప్రజలు భయభ్రాంతులకు గురై రాత్రిళ్లు నిద్రలేకుండా గడుపుతున్నారు. ఇటీవల వరుసగా వచ్చిన భూకంపాల తీవ్రత తక్కువగా ఉండగా ఆదివారం తెల్లవారుజామున వచ్చిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు మరింత భయాందోళన చెంద ఇళ్లల్లో నిద్రపోతున్న వారంతా ఒక్కసారిగా రోడ్లు ఎక్కారు. భూకంప తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోని వస్తువులు కింద పడ్డాయని, అదేవిధంగా కొన్ని ఇళ్లకు పగుళ్లు వచ్చాయని ప్రజలు పేర్కొన్నారు. భూకంప తీవ్రత  మండలంలోని దొండపాడులో ఏర్పాటు చేసిన భూకంపలేఖిని(రిక్టర్‌ స్కేల్‌)పై అత్యధికంగా 4.6 గా నమోదైనట్లు తాసిల్దార్‌ కమలాకర్‌ తెలిపారు. కొన్ని రోజుల నుంచి రెండ్రోజులకోసారి ఇలా  భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.


భయభ్రాంతుల్లో ప్రజలు..

మేళ్లచెర్వు/నేరేడుచర్ల/గరిడేపల్లి/హుజూర్‌నగర్‌రూరల్‌ : మేళ్లచెర్వు మండలంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధాలతో 7,8 సెకన్లపాటు  భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై రోడ్లపైకి వచ్చి జాగారం చేశారు. అదేవిధంగా నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ప్రజలు తెలిపారు. ప్రకంపనలకు ఇళ్లలోని వస్తువులు కిందపడినట్లు చెప్పారు. హుజూర్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లోనూ స్వల్పంగా భూమి కంపించినట్లు తెలిపారు. భయంతో తెల్లవారే వరకు వీధుల్లోకి వచ్చి జాగారం చేసినట్లు చెప్పారు.   


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : నగేశ్‌

చింతలపాలెం : చింతలపాలెం మండలంతోపాటు తదితర ప్రాంతాల్లో తరచుగా వస్తున్న భూకంపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్‌జీఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్త నగేశ్‌ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తాసిల్దార్‌ కమలాకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కోదాడ ఆర్డీఓ కిశోర్‌కుమార్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం మండలంలోని పాత వెల్లటూరు కేంద్రంగా వస్తున్నాయని తెలిపారు. ఈ భూకంపాల తీవ్రత సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్‌; ఆంధ్రాలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కూడా నమోదైనట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా వస్తున్న భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉందని, తెల్లవారుజామున వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై అత్యధికంగా 4.6గా నమోదైటన్లు తెలిపారు. ఈ భూకంపంతో  ఎలాంటి ప్రాణనష్టంగానీ, ఆస్తినష్టంగానీ జరగలేదని తెలిపారు. 


ప్రజలు భావిస్తున్నట్లు సున్నపురాయి మైనింగ్‌, పులిచింతల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో రావడం లేదని చెప్పారు.  భూమికి 7కిలోమీటర్ల లోతులో రాళ్ల కదళికల కారణంగా వస్తున్నాయని చెప్పారు. గత కొన్ని రోజులుగా వస్తున్న భూప్రకంపనలు సాధారణం(టెక్టోనిక్‌)గా వచ్చేవి మాత్రమేనన్నారు. 13 జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు 300సార్లు భూకంపాలు సంభవించాయని, వాటిలో అత్యధికంగా రిక్టర్‌ స్కేల్‌పై 4.6గా నమోదైనట్లు, 6పాయింట్ల వరకు ఎలాంటి ప్రాణ, ఆస్టి నష్టం ఉండవన్నారు. పాత ఇళ్లల్లో ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.   భూకంపాల తీవ్రత ఎక్కువైతే సంబంధిత అధికారులకు వెంటనే తెలపాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గ్యామానాయక్‌, వైస్‌ ఎంపీపీ పొల్నేడి శ్రీనివాసరావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సురేశ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.   


logo