గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 27, 2020 , 04:07:56

అభివృద్ధికి పునరంకితమవ్వాలి

అభివృద్ధికి పునరంకితమవ్వాలి
  • జిల్లా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది..
  • సంక్షేమ పథకాల అమలులో ముందంజ
  • ఇంటింటికీ పథకాలు అందేలా చర్యలు
  • గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌
  • పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండావిష్కరణ

సూర్యాపేటసిటీ : జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి పునరంకితమవ్వాలని 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ అధికారులకు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందేశమిస్తూ ఎందరో మహానుభావుల త్యాగంతో స్వాతంత్య్రం సిద్ధించిందని, అలాంటి అమరవీరులకు, తెలంగాణ సాధన ఉద్యమంలో అమరులైన వారికి జోహార్లు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనలో భాగంగా జిల్లాలో సమగ్ర అభివృద్ధి చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.   


వ్యవసాయశాఖ .. 

నీటి వనరులను అందుబాటులోకి తేవడంతో జిల్లాలో వ్యవసాయం మరింత సాగులోకి వచ్చిందన్నారు. ఈ రబీలో 70వేల హెక్టార్లలో సాధారణ విస్తీర్ణానికి ఇప్పటికే 84వేల హెక్టార్లలో సాగు జరిగినట్లు తెలిపారు. రబీలో 2260 క్వింటాళ్ల వరి, వేరుశనగ విత్తనాలు రాయితీపై రైతులకు అందజేసినట్లు చెప్పారు. రబీకి 16వేల 900మెట్రిక్‌ టన్నుల యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతుబంధు కార్యక్రమంలో భాగంగా రైతులకు సంవత్సరానికి ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయాన్ని ఇస్తుందన్నారు. 2018-19లో 2లక్షల మంది రైతులకు రూ.417కోట్లు, 2019 ఖరీఫ్‌కు రూ.253కోట్లను 2లక్షల 14వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 


అదేవిధంగా 2018-19లో జిల్లాలో చనిపోయిన 814మంది రైతు కుటుంబాలకు రూ.40కోట్ల 70లక్షల బీమా చెల్లించినట్లు పేర్కొన్నారు. రైతులకు మేలైన విత్తనాలను తక్కువ ఖర్చుతో అందించేందుకు ప్రభుత్వం గ్రామస్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తుందన్నారు. ఉద్యానవనశాఖలో ఉత్పాదకత పెంపు, శీతలగిడ్డంగుల నిర్మాణం, డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వంటి వాటికి రూ.227కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 309 చెరువుల్లో సుమారు 236లక్షల చేప పిల్లలను పెంచేందుకు 100శాతం రాయితీపై ప్రభుత్వం సరఫరా చేసిందని తెలిపారు. మార్కెటింగ్‌ కోసం రూ.25కోట్లతో మత్స్యకారులకు ద్విచక్ర, లగేజీ ఆటోలు, బొలెరోలు అందించినట్లు చెప్పారు. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో యాదవులకు 35,200గొర్రెలు పంపిణీ చేయగా ఇంకా 20,500 గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.  


మిషన్‌ కాకతీయ, భగీరథ.. 

మిషన్‌ కాకతీ పథకం ద్వారా జిల్లాలో 907చెరువులకు 878మంది చెరువుల్లో పూడికతీత పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.358 కోట్ల అంచనాతో పరిపాలన అనుమతులు పొంది ఇప్పటి వరకు 878పనులు రూ.276కోట్ల వ్యయంతో పూర్తి చేయగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మూసీ కాల్వల ఆధునీకరణకు రూ.66కోట్లు, జిల్లా కేంద్రంలో మూడు చెరువులను మిని ట్యాంక్‌బండ్‌లుగా మార్చేందుకు రూ.28.20కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో రూ.855కోట్ల వ్యయంతో సురక్షిత మంచినీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో ఈ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.  


డబుల్‌ బెడ్రూం ఇండ్లకు పెద్దపీట 

డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకం ద్వారా జిల్లాలో 4వేల 264 గృహాలకు పరిపాలన అనుమతులు మంజూరు కాగా వాటిలో 3,166గృహాలు ప్రారంభించామన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు రూ.118.35కోట్ల వ్యయంతో 1300గృహాలు నిర్మాణం పూర్తిచేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.  


 సంక్షేమ కార్యక్రమాలు 

ఎస్సీ సంక్షేమానికై జిల్లాలోని 33 ఎస్సీ వసతి గృహాల్లో 3050మంది విద్యార్థులకు రూ.2.24కోట్లు ఖర్చు చేసినట్లు, కళాశాల వసతి గృహాలకు 1.33కోట్ల వ్యయంతో వసతి కల్పించడమే కాకుండా పోస్ట్‌మెట్రిక్‌, ఫ్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 320మందికి రూ.11లక్షల వ్యయంతో శిక్షణ , 13 గిరిజన పాఠశాలల వసతి గృహాల ద్వారా 2,564మంది, 8కళాశాల వసతిగృహాల్లో 960మంది విద్యార్థులకు వసతి కల్పించడమే కాకుండా వీరికి రూ.102లక్షలు ఖర్చు చేశామన్నారు. బీసీ సంక్షేమశాఖ ద్వారా 16ఫ్రీమెట్రిక్‌, 9పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల ద్వారా 2,471మందికి రూ.27.61కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు చెప్పారు. నిరుద్యోగులకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా 10,130మందికి రూ.5.63కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.61లక్షలు మెస్‌ చార్జీలు, రూ.1.59కోట్ల బోధనా రుసుం చెల్లించినట్లు పేర్కొన్నారు. షాదీముబారక్‌ కింద రూ.3.55కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది 40లక్షల 3వేల పనిదినాలు కల్పించామని, ఇప్పటికి 43.52కోట్లు చెల్లించామన్నారు.  


ఆసరాతో అండగా నిలిచాం 

ఆసరా పథకం కింద వృద్దాప్య, వితంతు, కల్లుగిత, ఒంటరి మహిళలకు 1లక్ష 35వేల మందికి రూ 31కోట్ల 32లక్షల రూపాయలు పించన్‌లు చెల్లించామన్నారు. జిల్లాలో దివ్యాంగుల కొరకు 308 మూడు చక్రాల వాహనాలు, 78 వీల్‌ చైర్‌లు, 18లాప్‌టాప్‌లను రూ 30లక్షల వ్యయంతో మంజూరు చేశామన్నారు. వివాహ ప్రోత్సాహక పథకం కింద జిల్లాలో 204మంది లబ్దిదారులకు 1కోటి 4లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. 107మంది దివ్యాగులకు సబ్సిడీ లోన్‌గా 85లక్షల 90వేల రూపాయలు మంజూరు చేశారు.  


మెడికల్‌ కళాశాల జిల్లాకు వరం 

జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల జిల్లాకు వరంలాంటిందని చెప్పారు. కంటి వెలుగు  ద్వారా జిల్లాలో 4.50లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 55,200మందికి  రూ.16.27కోట్ల వ్యయంతో కేసీఆర్‌ కిట్లు అందజేశామన్నారు. 24గంటల కరెంటు ద్వారా 1.28లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు.  


వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు 

రోడ్లు భవనాల అభివృద్ధిలో భాగంగా అన్ని మండలాలకు జిల్లా కేంద్రం నుంచి డబుల్‌ లైన్‌ రహదారులుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, జిల్లాలోని శాసనసభ్యుల కార్యాలయాల నిర్మాణాలకు ఓక్కొదానికి రూ.కోటి మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో కుల సంఘాల భవనాలు, బీటీ రోడ్లు, సైడ్‌ కాల్వల నిర్మాణానికి రూ.37కోట్ల అంచనాతో ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడడంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ఫిర్యాదు చేసిన పది నిమిషాల్లో చేరుకొని భరోసా కల్పిస్తున్నామన్నారు. మహిళల రక్షణకు 5షీటీం బృందాలు పని చేస్తున్నాయన్నారు.  జేసీ డి.సంజీవరెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌, డీఆర్‌ఓ పి.చంద్రయ్య, పీడీ కిరణ్‌కుమార్‌, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి, వ్యవసాయాధికారి జ్యోతిర్మయి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి దయానందరాణి, ఎస్టీ సంక్షేమశాఖ అధికారి శ్రీనివాస్‌, ఐసీడీఎస్‌ అధికారి నర్సింహారావు, డీఎస్పీ నాగేశ్వర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ పి.రామానుజులరెడ్డి, అధికారులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  


logo