బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 27, 2020 , 04:00:28

మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక నేడే

మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక నేడే
  • టీఆర్‌ఎస్‌కు ఐదు పీఠాలు లాంఛనమే!
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • 11 గంటలకు వార్డు కౌన్సిలర్ల ప్రత్యేక సమావేశం
  • మధ్యాహ్నం 12 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ  చైర్మన్లు నేడు ఎన్ను కోనున్నారు.  ఐదు మున్సిపాలిటీల్లో కూడా అధికార టీఆర్‌ఎస్‌ ఛైర్మన్ల ఎన్నిక లాంఛనంగా ముగియబోతోంది. ఆయా మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్ల ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. పార్టీల వారీగా తెలుగు వర్ణమాల ప్రకారం కౌన్సిలర్లకు సీటింగ్‌ ఏర్పాటు చేశారు. తొలుత అందరితో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు. 


ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో అన్ని రాజకీయ పార్టీలు విప్‌లను అందించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ అభ్యర్థిత్వాలను ప్రతిపాదించడం... బలపర్చడం, అనంతరం చేతులు ఎత్తే పద్ధతిన ఎన్నిక పూర్తి కానుంది. తొలుత చైర్మన్‌ ఎన్నిక నిర్వహించి అనంతరం వైస్‌ చైర్మన్‌ ఎన్నికను పూర్తి చేస్తారు. మొత్తం సభ్యుల్లో 50శాతానికి కనీసం ఒక్కటి అదనంగా ఉన్న వారికే పదవులు దక్కనున్నాయి. అయితే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కూడా అధికార టీఆర్‌ఎస్‌కే పీఠాలు దక్కుతున్నా యి. 


సూర్యాపేటలో మొత్తం 48 వార్డులకు   24 టీఆర్‌ఎస్‌ గెలవగా ముగ్గురు స్వతంత్య్ర అభ్యర్థుల మద్దతు ఆ పార్టీకే ఉంది. అంతే కాకుండా స్థానిక   ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ఎక్స్‌ అఫిషియే సభ్యుడిగా ఓటు హక్కు ఉండడంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ బలం 28కి చేరి ఎన్నిక లాంఛనం కానుంది. అలాగే కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఉండడంతో టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా కైవసం చేసుకోనుంది. ఇక నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 7 చొప్పున టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ గెలవగా ఒక స్థానంలో సీపీఎం విజయం సాధించింది. 


అలాగే అక్కడ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, శాసనమండలి సభ్యులు బొడకంటి వెంకటేశ్వర్లు, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలు తమ ఓటు నమోదు చే యించుకోవడంతో టీఆర్‌ఎస్‌ బలం 10కి చేరుకుంటుంది. ఇక కాంగ్రెస్‌, సీసీఎంలు కలిపి 8 మంది ఉండగా నల్లగొండ ఎంపీ ఉత్తంకుమార్‌రెడ్డి కూడా ఈ మున్సిపాలిటీలోనే నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్‌ బలం 9కి చేరినా టీఆర్‌ఎస్‌కే సంఖ్యబలం ఉండడంతో ఆ పార్టీనే ఇక్కడ అనూహ్యంగా తొలి పురపీఠాన్ని అధిష్టించబోతోంది. 


logo