ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 26, 2020 , 05:30:17

కారు జోరు..

కారు జోరు..
  • -మున్సిపల్‌ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ జయకేతనం
  • - నాలుగు పీఠాలు కైవసం.. ఒకటి సమాన ఓట్లు
  • -అది కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వచ్చే అవకాశం
  • - జిల్లాలో 141 వార్డులకు 87 టీఆర్‌ఎస్‌కు
  • - కాంగ్రెస్‌ 41, బీజేపీ 5, టీడీపీ 1, సీసీఎం 2, స్వతంత్రులు 5


మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. ఎన్నికలేవైనా గులాబీదే విజయమని నిరూపించింది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకుగాను సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి నాలుగు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా నేరేడుచర్ల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు సమాన సీట్లు రాగా సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించింది. ఇక్కడ ఎక్స్‌అఫీషియో ఓట్లతో టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడడం ఖాయమని తెలుస్తుంది. ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులకుగాను 87 వార్డులు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్‌ 41 , బీజేపీ 5, టీడీపీ 1, సీసీఎంకు 2 సీట్లు దక్కగా స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు.

సూర్యాపేట టౌన్‌ : జిల్లాలో జరిగిన పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గులాబీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సూర్యాపేటలో గులాబీ శ్రేణుల సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌ హాల్‌ నుంచి జిల్లా కేంద్రంలో ఆయా వార్డుల్లో బాణసంచా పేల్చుతూ.. జై తెలంగాణ.. జై కేసీఆర్‌.. జైజై జగదీశన్న అంటూ జయజయ ధ్వానాల నడుమ  బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరూ మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి  విద్యుత్‌ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, శాలువాలు అందించి కృతజ్ఞతలు తెలుపుగా వారందరినీ మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందించారు. ఈ వేడుకల్లో ఆయా వార్డుల్లో గెలుపొందిన అభ్యర్థులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.logo