మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 26, 2020 , 05:29:19

గులాబీ గుబాళింపు

గులాబీ గుబాళింపు
  • -మున్సిపల్‌ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ జయకేతనం
  • - నాలుగు పీఠాలు కైవసం.. ఒకటి సమాన ఓట్లు
  • - అది కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వచ్చే అవకాశం
  • - జిల్లాలో 141 వార్డులకు టీఆర్‌ఎస్‌87, కాంగ్రెస్‌ 41, బీజేపీ 5, టీడీపీ 1, సీసీఎం 2, స్వతంత్రులు 5


సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ నెల 22న జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన విషయం విదితమే. పోలింగ్‌ అనంతరం ఆయా మున్సిపాలిటీల్లోని బ్యాలెట్‌ బాక్స్‌లను సూర్యాపేట ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించి శనివారం కౌంటింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా  11 గంటలకు తొలి రౌండ్‌ ఫలితాలు వెలువడ్డాయి. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ సీట్ల ఆధిక్యం స్పష్టంగా కనిపించగా రెండో రౌండ్‌ పూర్తయ్యే సరికే ఆయా మున్సిపాలిటీలపై గులాబీ కైవసం చేసుకున్నట్లు తేటతెల్లమైంది. సూర్యాపేటలో 48 వార్డులకుగాను 24 టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా చైర్మన్‌ పీఠం కోసం మరొక్క ఓటు అవసరం ఉంది. అయితే ఇక్కడ నలుగురు ఇండిపెండెంట్లు గెలవడంతోపాటు ఎక్స్‌ అఫిషియో సభ్యులు ముగ్గురు ఉన్నారు. ఈ లెక్కన సూర్యాపేటపై గులాబీ జెండా ఖరారైంది. అలాగే కోదాడలో 35 వార్డులకుగాను 25 వార్డులు, హుజూర్‌నగర్‌లో 28 వార్డులకు 20, తిరుమలగిరిలో 15 వార్డులకు 11 టీఆర్‌ఎస్‌ విజయం సాధించి స్పష్టమైన మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు చైర్మన్లు కాబోతున్నారు. మరో మున్సిపాలిటీ అయిన నేరేడుచర్లలో 15 వార్డులకు గాను 7 టీఆర్‌ఎస్‌, 7 కాంగ్రెస్‌ గెలువగా మరో సీటు సీసీఎంకు దక్కింది. దీంతో ఇక్కడ ఎవరికి పీఠం దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ఇది కూడా టీఆర్‌ఎస్‌కు కచ్చితంగా దక్కించుకోవచ్చు. ఇక్కడ రెండు పార్టీలకు చెరి సమానం ఓట్లు వచ్చినందున స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నేరేడుచర్లలో ఓటు హక్కు వినియోగించుకోనుండగా, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా అక్కడే ఓటు వేయనుండడంతో మళ్లీ ఇద్దరికీ 8 చొప్పున రానున్నాయి. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యుడు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నందున నేరేడుచర్ల పీఠం కూడా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాడబోతోంది.               logo