మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 25, 2020 , 01:27:40

ఘనంగా జన జాతర

ఘనంగా జన జాతర
  • సైదన్న ఉర్సుకు లక్షలాదిగా తరలివచ్చిన జనం
  • ఘనంగా గంధోత్సవం(ఉర్స్-ఏ-షరీఫ్)
  • హాజరైన హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
  • దారులన్నీ జాన్‌పహాడ్ దర్గా వైపే
  • భక్తులతో కిక్కిరిసిన దర్గా పరిసరాలు


పాలకవీడు : హిందూ, ముస్లిం మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జాన్‌పహాడ్ దర్గా ఉర్సులో రెండో రోజు  గంధోత్సవం (ఉర్స్-ఏ-షరీఫ్) శుక్రవారం అత్యంత ఘనంగా, సంప్రదాయ బద్ధంగా జరిగింది. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు   నుంచి తీసుకొచ్చిన గంధాన్ని ఫకీర్ల ఖవ్వాలీలతో, మేళతాళాల మధ్య జాన్‌పహాడ్ గ్రామంలో గల వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని సందల్ ఖానాలో అమర్చిన కళశాలలో ఉంచారు. మరోవైపు దర్గాపూజారీ సయ్యద్ అలీబాబా,  జానీల ఇంటి  నుంచి గుర్రాలపై తీసుకొని వచ్చిన గంధాన్ని సందల్‌ఖానాలో గల గంధంతో  కలిపారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, హుజుర్‌నగర్  ఎమ్మెల్యే శానంపూడిసైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ గంధాన్ని ఎత్తుకొని ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం  జాన్‌పహాడ్ దర్గా ప్రధాన వీధుల్లో ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షణలో  పోలీసు బందోబస్తు మధ్య ఆరుగంటల పాటు దర్గా నుంచి కల్మటి తండా, జాన్‌పహాడ్ గ్రామాల్లో గంధం ఊరేగింపు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు గంధం అందుకోవడానికి ఒక్కసారిగా ఎగబడడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకొంది. అనంతరం దర్గా లోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్‌షా, జాన్‌పహాడ్ సయ్యద్ రహమతుల్లా సమాధుల మీదకి గంధాన్ని ఎక్కించారు.

పటిష్ట ఏర్పాట్లు

 పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్పీ భాస్కరన్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  1 డీఎస్పీ, 7గురు  సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 350 మంది కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో  మూడు  ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 50 మంది సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు నిత్యం విద్యుత్ అందేలా చర్యలు తీసుకున్నారు. ఫైర్ ఇంజిన్‌ను అందుబాటులో ఉంచి, కోదాడ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోల  నుంచి 30 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దక్కన్ యాజమాన్యం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి ప్యాకెట్లు, పులిహోర పంపిణీ చేశారు.
ఈ ఉత్సవాలకు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈఓ మహమ్మద్ ఖాసీం, రైతు సమన్వయ సమితి జిల్లాకమిటీ సభ్యుడు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మలమంటి దర్గారావు, మాజీ  ఎమ్మెల్యే  జూలకంటి రంగారెడ్డి, ఎంపీపీ గోపాల్, జడ్పీటీసీ మాలోతు బుజ్జి, డీఎస్పీ రఘు, డీఆర్‌ఓ చంద్రయ్య, ఆర్డీఓ మోహన్‌రావు, ముజావర్ జానీ, సర్పంచ్ రూపావత్ గోరి, తాసిల్దార్లు కృష్ణానాయక్, రాంరెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్‌ఐలు నరేశ్, యాదవేంద్రరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ఎరెడ్ల సత్యనారయణరెడ్డి, దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, దాదేఖాన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

హోంమంత్రికి ఘన స్వాగతం..

ఉత్సవాలకు తొలిసారి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరుకావడంతో జిల్లా యంత్రాంగం ఆయనకు ఘనస్వాగతం పలికారు. కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ బాస్కరన్‌లు మంత్రికి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. దర్గా ముజావర్ జానీబాబా మంత్రి, ఎమ్మెల్యే శానంపూడికి సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి చేతికి దట్టీలు కట్టి ప్రత్యేక పూజలు చేశారు.

భారీగా జనం..

గంధోత్సవం రోజు ఉత్సవాలకు  భక్తులు భారీగా తరలిరావడంతో దర్గా పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. సఫాయి బావి వద్ద భక్తులు పుణ్యస్నానాలాచరించి, దర్గా వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రార్ధనలు చేశారు. సైదులు బాబా దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలో నిల్చున్నారు. దర్గా ఆవరణలో ఉన్న నాగేంద్రుడి పుట్టలో పాలు, గుడ్లు వేసి, కొబ్బరికాయలు కొట్టి  మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం భక్తులు వారి బంధుమిత్రులను ఆహ్వానించి కందూరు చేశారు. కొందరు తలనీలాలు ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రాలోని కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు  జిల్లాల నుంచి సైతం భక్తులు భారీగా తరలి వచ్చి  సైదన్న దర్శనం  చేసుకున్నారు. మహంకాళిగూడెం పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలాచరించారు.


logo