ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 25, 2020 , 01:25:56

నేడే పుర ఫలితాలు

నేడే పుర ఫలితాలు
  • 5 మున్సిపాలిటీలు.. 140 వార్డులు
  • ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
  • మూడు రౌండ్ల అనంతరం పూర్తి కానున్న ఫలితాలు
  • ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ.. ప్రజల్లో ఆసక్తి

 సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల బ్యాలెట్ బాక్స్‌లను జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో పటిష్ట బందోబస్తు మధ్య భద్రపర్చారు. కాగా నేడు అన్ని మున్సిపాలిటీల కౌ ంటింగ్ జరుగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చే శారు. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ సిబ్బంది రిపోర్ట్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కాగా ఏడు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌటింగ్ సులభతరంగా పూర్తి చేసేందుకు ఆయా మున్సిపాలిటీల వార్డుల సంఖ్యను బట్టి టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు అధికారులు, అసిస్టెంట్లు కలిపి ఐదుగురిని నియమించారు. ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా మూడు రౌండ్లలో ఫలితాలు పూర్తి అవుతాయి. తొలుత స్ట్రాంగ్ రూం నుంచి ప్రతి టేబుల్ వద్దకు ఆయా వార్డుల్లోని బూత్ నెంబర్ల వారీగా బ్యాలెట్ బాక్స్‌లను తెచ్చి ఫాం 16 ప్రకారం పోలైన ఓట్లను 25 చొప్పున బండిల్స్ చేస్తూ బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఓట్ల సంఖ్యను సరిచూస్తూ అన్నింటినీ ప్రత్యేక డ్రమ్ములో వేస్తారు. తిరిగి ఒక్కో టేబుల్‌కు 25 చొప్పున కట్టిన 40 బండిళ్లను అంటే 1000 ఓట్లను తీసుకొని అభ్యర్థుల వారీగా విడదీసి 100 చొప్పున కట్టలు కట్టి కౌంటింగ్ చేయడం ద్వారా ఫలితాలు వెలువడనున్నాయి. ఇలా సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డులకు గాను 32 టేబుళ్లు ఏర్పాటు చేయగా ప్రతి రెండు టేబుళ్లకు ఒక వార్డు చొప్పున ఒక రౌండ్‌లో 16 వార్డుల ఫలితాలు వెలువడతాయి. అలాగే కోదాడ మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను వార్డుకు ఒక టేబుల్ చొప్పున 12 టేబుళ్లు, హుజూర్‌నగర్‌లో 28 వార్డులు ఉండగా ఇక్కడ ఒక్కో వార్డుకు ఒక టేబుల్ చొప్పున 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో 15 వార్డులకుగాను 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి రౌండ్‌కు కొన్ని వార్డుల చొప్పున ఫలితాలు వెల్లడి కానుండగా మూడు రౌండ్లలో మొత్తం ఫలితాలు తేలుతాయి. కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎస్పీ భాస్కరన్‌లతో పాటు డీఆర్‌ఓ చంద్రయ్య   అధికారులు శుక్రవారం సందర్శించి పలు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే ఓట్ల కోసం వంగివంగి దండాలే కాదు సాష్టాంగ నమస్కారాలు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులంతా ఓట్లు ఎవరికి పడ్డాయో తెలియక నేటి కౌంటింగ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క ప్రజలు మాత్రం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.logo