శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 24, 2020 , 04:51:38

తడిసి మోపెడు

తడిసి మోపెడు
  • - అత్యంత ఖరీదుగా మారిన మున్సిపల్‌ ఎన్నికలు
  • - జిల్లాలో రూ.107 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా
  • - లెక్కలు వేస్తున్న అభ్యర్థులు.. గుండెలు బాదుకుంటున్న కుటుంబ సభ్యులు

మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడైంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో దాదాపు రూ.107 కోట్లకు పైనే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
మందు, చికెన్‌, మటన్‌, బిర్యానీ ప్యాకెట్లతోపాటు ఒక్క ఓటుకు రూ.2 వేల నుంచి రూ. 6 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఇలా కొన్ని వార్డుల్లో ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున రూ.35 నుంచి 50 లక్షలకు పైనే ఖర్చు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సూర్యాపేటలో వివిధ పార్టీలు, స్వంతంత్ర అభ్యర్థులు కలిసి 106 మంది ఉండగా రూ.49 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.. కోదాడలో 80 మంది రూ.25 కోట్లు, హుజూర్‌నగర్‌లో 59 మంది రూ.13 కోట్లు, నేరేడుచర్లలో 33 మంది రూ.9 కోట్లు, తిరుమలగిరిలో 37 మంది రూ.11 కోట్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.107 కోట్లు వెచ్చించారు. బుధవారం పోలింగ్‌ ముగియగా గురువారం ఎన్నికల ఖర్చు వివరాలను తెలుసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఎన్నికల కోసం ముందే జమ చేసిన డబ్బులు, అప్పటికప్పుడు అక్కడక్కడా తీసుకొచ్చినవి, అత్యవసరంగా తాకట్టు పెట్టి తెచ్చినవి, తదితర ఖర్చుల లెక్కలు చూసి షాక్‌ అవుతున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులకు మాత్రం గుండెలు బాదుకునే పరిస్థితి ఏర్పడింది.

సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ :  జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 141 వార్డులకు  ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 140 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం విధిత మే. అయితే ఎన్నికల బరిలో మాత్రం టీఆర్‌ఎస్‌ అన్ని వార్డుల్లో పోటీ చేయగా ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు కొన్ని వార్డులకు అభ్యర్థులు దొరకకపోవడంతో ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చారు. ఈ  సారి ఎన్నికల్లో కొన్ని వార్డుల్లో త్రిముఖ, చాలా వార్డులో ద్వి ముఖ పోటీ కనిపించింది. ప్రధానంగా సూర్యాపేట లో 10, తిరుమలగిరి 2, కోదాడ 6, హుజూర్‌నగ ర్‌ 3, నేరేడుచర్లలో 1 చొప్పున వార్డుల్లో టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్షాలు, ఇండిపెండెంట్లు ఇలా మగ్గురు అభ్యర్థులు బరిలో ఉండి పోటీలు పడి మరీ ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక మిగిలిన వార్డుల్లో ద్వి ముఖ పోటీ నెలకొని గెలుపు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడకుండా ఇళ్లు.. ప్లాట్లు.. ఇంట్లో బంగారం తదితరాలను తాకట్టు పెట్టి లక్షలాది రూపాయలు తెచ్చి జనం పాలు చేశారు. కొంతమం ది అ భ్యర్థులు తమ ఆర్థిక పరిస్థితిని మించి ఉన్న ఆస్తులు అమ్మడం, లక్షలాదిగా అప్పులు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. భవిష్యత్‌ను ఆలోచించకుం డా లక్షలాది రూపాయలను ఖర్చు చేయడంతో పలు కుటుంబాల్లో తగాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

జిల్లాలో అక్షరాల రూ.107 కోట్లు 

జిల్లా వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో దాదాపు 107 కోట్లకు పైనే అనాధికారిక ఖర్చు అయినట్లు తెలుస్తుంది. సూర్యాపేటలో 48 వార్డులకు 200ల మంది బరిలో ఉండగా 106 మంది వివిధ రాజకీయ పార్టీలు,  స్వతంత్రులు పోటీలు పడి మరీ ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. సుమారు 10 వార్డుల్లో బిగ్‌ఫైట్‌ నెలకొనగా అక్కడ ముగ్గురు అభ్యర్థుల చొప్పున మొత్తం 30 మంది దాదాపు 50 నుంచి 70 లక్షలు ఖర్చు చేశారని ఈ పది వార్డుల్లో 15 నుంచి 21 కోట్లు ఖర్చు చేసినట్లు  వినికిడి. అలాగే మరో 15 వార్డుల్లో ఇద్దరు చొప్పున 30 మంది 50లక్షల వరకు ఖర్చు చేయగా ఇక్కడ 15 కోట్లు ఖర్చు కాగా మిగిలిన 23 వార్డుల్లో 46 మంది అభ్యర్థులు 13కోట్లకు పైనే ఖర్చు చేశారని ఇలా కేవలం సూర్యాపేటలోనే 49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు తేలుతున్నాయని ఆయా వార్డుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా కోదాడ  మున్సిపాలిటీలో 35 వార్డులకు త్రిముఖ, ద్విముఖ పోటీ నెలకొన్ని వార్డులన్నీ కలిపి దాదాపు 80 మంది సుమారుగా రూ. 35 లక్షల చొప్పున మొత్తం ఇక్కడ 25 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అలాగే హుజూర్‌నగర్‌లో 28 వార్డులకు   60 మంది అభ్యర్థులు బరిలో నిలిచి రూ.2వేల నుం చి 5వేల వరకు ఒట్లకు పంపిణీతో పాటు ఇతరత్రాలు కలిపి దాదాపు రూ.11 కోట్ల ఖర్చు చేశారని అక్కడ చర్చ వినిపిస్తుంది. 

నేరేడుచర్లలో 15 వార్డులకు  33 మంది అభ్యర్థులు ఖర్చు చేశారని ఇక్కడ ఒకే వా ర్డులో కోటికి పైనే ఖర్చు కాగా మిగిలిన చోట ఒక్కో అభ్యర్థి 25 నుంచి 35 లక్షల వరకు ఖర్చు చేయడంతో దాదాపు రూ.8 కోట్లకు పైనే ఓటర్లకు ముట్టినట్లు అక్కడ ప్రజలే లెక్కలు వేసుకుంటున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డులకు 40 మంది వరకు అభ్యర్థులు 20 నుంచి 25 లక్షల చొప్పున సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం మీద జిల్లా వ్యా ప్తంగా ఈ ఎన్నికల కోసం 107 కోట్లు ఖర్చు చేసినట్లు పలువురు లెక్కలు వేస్తున్నారు. మొత్తం మీద మున్సిపల్‌ ఎన్నికల్లో చేసిన ఖర్చులను, తెచ్చిన అప్పులు, తాకట్టుపెట్టిన ఆస్తుల లెక్కలు చూసుకుంటూ గురువారం అభ్యర్థులంతా బిజీబిజీగా గడిపినట్లు సమాచారం. పోలింగ్‌ అయిపోయినందన ఫలితాల కోసం ఎదురు చూడడం అభ్యర్థులు, ఓటర్ల వంతైంది.logo