సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 23, 2020 , 03:53:32

సాగర్ ఆయకట్టులో సాగు సందడి

సాగర్ ఆయకట్టులో సాగు సందడి


మిర్యాలగూడ, హాలియా నమస్తేతెలంగాణ: యాసంగి సాగులో భాగంగా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో సాగు సందడి మొదలైంది. ఎడమ కాల్వ కింద సాగుకోసం నీటి విడుదల షెడ్యూల్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 17 2020 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఆరు విడుతలుగా ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం షెడ్యూల్ పేర్కొంది. ఆయకట్టులో మెట్ట పం టలు గతంలో ఆశాజనకంగా లేక పోవడంతో రైతులు ఎక్కువగా వరినాట్లు వేసేందుకే సిద్ధమయ్యారు.
  

50శాతం పూర్తయిన వరినాట్లు

నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు కింద ఇప్పటి వరకు లక్ష 90వేల ఎకరాలకు పైగా వరినాట్లు పూర్తయ్యాయి. ఆయకట్టులో రైతులు బోరుబావులు, ఊటబావుల ఆధారంగా ముందస్తుగా నార్లు పోసుకోవడం వల్ల యాసంగి నాట్లు త్వరగా పూర్తి చేశారు. ఆయకట్టులో రైతులకు అధిక మొత్తంలో నీటి వసతి ఉండడంతో ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేశారు. మరో 20రోజుల్లో కాల్వచివరి భూముల్లో సైతం నాట్లు పూర్త య్యే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
  

కలిసివస్తున్న ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగేళ్ల క్రితం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలకు శ్రీకారాం చుట్టారు. ఈ పద్ధతి వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీరు గణనీయంగా పొదుపు అవుతోంది. ఆరుతడి పద్ధతిలో వరిసాగు చేయడం వల్ల పంటలు పుష్కలంగా పండటమే కాకుండా చీడపీడల తాకిడి తగ్గిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కాల్వ చివరి భూములకు సైతం సాగు నీరు అందుతుండడంతో ఆయా ప్రాంతాల రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు నీటిని పొదుపుగా వాడాలి

సాగర్ ఎడమకాల్వ ఆయకట్టులో రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి. కాల్వ చివరి భూములకు నీరు అందే విధంగా ముందు రైతులు సహకరించాలి. ఆరుతడి విధానం వల్ల అధిక దిగుబడి వస్తుంది. ఆయకట్టులో నీటి సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి.

పంటల దిగుబడి బాగా ఉంది

ఆరుతడి విధానం వల్ల మంచి దిగుబడి వస్తోంది. నాలుగేళ్ల నుంచి ఇదే విధానంలో సాగు నీరు విడుదల అవుతోంది. మేము కూడా ఈ విధానానికి అలవాటు పడ్డాము. ఈ పద్ధతిలో సాగునీరు అందించడం వల్ల పంటలు బాగా పండుతున్నాయి. చీడపీడల బెడద తక్కువగా ఉంటోంది. నీరు కూడా పోదుపు అవుతోంది.logo