ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 22, 2020 , 04:39:01

ప్రతి అంశాన్ని పీఓ డైరీలో నమోదు చేయాలి

ప్రతి అంశాన్ని పీఓ డైరీలో నమోదు చేయాలి


సూర్యాపేట, నమస్తేతెలంగాణ : పోలింగ్ కేంద్రంలో ప్రతి అంశాన్ని పీఓ డైరీలో నమోదు చేయాలని కలెక్టర్ డి.అమయ్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. జిల్లాలో జరిగే ఐదు మున్సిపాల్టీల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సూర్యాపేటలో 48, కోదాడలో 35, హుజూర్ 28, తిరుమలగిరిలో 15, నేరేడుచర్లలో 15వార్డులు ఉండగా సూర్యాపేటలో 98,653, కోదాడలో 53,922, హుజూర్ 28,342, తిరుమలగిరిలో 13,767, నేరేడుచర్లలో 13,543 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఐదు మున్సిపాల్టీల్లో 339పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సామగ్రిని ఐదు మున్సిపాల్టీలకు ఆయా కేంద్రాల ద్వారా పంపించినట్లు చెప్పారు. ఈనెల 25న జరిగే కౌంటింగ్ సూర్యాపేట 32, కోదాడ12, హుజూర్ 10, తిరుమలగిరి 5, నేరేడుచర్ల 5కేంద్రాలను ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు.

సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. నేడు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్  జరుగుతుందని, ఓటర్లు నిర్దేశిత సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాల్లో వెబ్, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా 2034మంది సిబ్బంది అవసరముండగా 5136మందిని అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా వారిపై నియమావళిలో భాగంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తదుపరి రిసెప్షన్ కేంద్రాల్లో చెక్ ప్రకారం సిబ్బంది సామగ్రిని అప్పగించాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం సూర్యాపేట, నేరేడుచర్ల, హుజూర్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. logo