శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 19, 2020 , 00:36:48

జాతి అస్తిత్వానికి చరిత్ర అవసరం

జాతి అస్తిత్వానికి చరిత్ర అవసరం


నడిగూడెం : మండల కేంద్రంలోని రాజావారి కోటలో దక్కన్‌ ఆర్కియాలజీ ఇన్‌స్టిట్యూట్‌ కల్చరల్‌  రీసెర్చ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్‌ మహాసభలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండ్రోజులపాటు నిర్వహించే ఈ సభలను హింపిలోని విరుపాక్ష విద్యారణ్య సంస్థాన పీఠాధిపతి శ్రీశ్రీ జగద్గురు విద్యారణ్య భారతీస్వామిజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ జాతికైనా అస్తిత్వం ఉండాలంటే ఆ జాతి చరిత్ర తెలుసుకోవాలని, గత చరిత్ర వర్తమాన సమాజానికి చుక్కాని కావాలన్నారు. మహోన్నత భారతదేశ చరిత్ర, సంస్కృతి సన్నగిలుతుందన్నారు. దానిని కాపాడి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు కోటలో నిర్మితమవుతున్న పరిశోధన కేంద్రం వేదిక అవుతుందన్నారు. పరభాష వేషాల పట్ల ప్రజలకు మమకారం తగ్గాలని సూచించారు. భాషల పట్ల అభిమానం ఉండాలి కానీ దురాభిమానం ఉండకూడదన్నారు. ఏ ప్రాంతానికైనా మాతృభాష ముఖ్యమన్నారు. భారతమాత అంటే తల్లి, గోమాత, గాయిత్రీమాత అన్నారు.  గోమాత అంటే 33కోట్ల దేవతల నిలయమని, 24గంటలు ప్రాణవాయువు ఇస్తుందన్నారు. గోమాత పాలు, పంచకం, పేడ ఆరోగ్యానికి మంచిదన్నారు. 

తెలుగు పద్యాలలో గొప్ప నీతి ఉందన్నారు. అన్ని భాషల కన్నా తెలుగు భాష లెస్సగా పేర్కొన్నారు.  విషిష్ట అతిథి ఏపీ శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ 20 శతాబ్దం తొలినాళ్లలో నడిగూడెంలో ప్రారంభమైన చరిత్ర, శాసన పరిశోధనతో తెలంగాణ చరిత్ర గ్రంధిస్తమైందన్నారు. ఆ సంప్రదాయాలను తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్‌ కొనసాగించాలన్నారు. చరిత్ర కలిగిన కోటలో పరిశోధన కేంద్రాన్ని ప్రారంభిచడం అభినందనీయమన్నారు.  మరో వక్త, విశ్రాంత డీజీపీ చెన్నూరి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ  మునగాల పరగణా సంస్థానాధీశుడు రాజా నాయిని వెంకటరంగారావు గొప్ప చరిత్రకారుడన్నారు.  ఆయన కోటలో ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం  ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతుందన్నారు.  మేధావుల సంఘం ఫోరం అధ్యక్షుడు చలసాని ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి చరిత్ర తెలిసి ఉండాలన్నారు.

రాజా వారి అనువంశీకుడు నాయిని సంతోశ్‌రెడ్డి మాట్లాడుతూ నాడు సంస్థానంలో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు చరిత్రపై ఎంతో కృషి చేశారని, మళ్లీ వంద ఏండ్ల తర్వాత దక్కన్‌ ఆర్కియాలజీ ఇన్‌స్టిట్యూట్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ వారి సహకారంతో పరిశోధన కేంద్రం ఏర్పాటు కావడం సంతోషదాయకమన్నారు. రీసెర్చ్‌ సెంటర్‌ డైరక్టర్‌ కుర్రా జితేంద్రబాబు మాట్లాడుతూ ఇది చరిత్ర, సంస్కృతి, పరిశోధన కేంద్రంగా అందరికీ స్వాగతం పలుకుతుందన్నారు. ఈ కేంద్రంలో 2.5 లక్షల పుస్తకాలు, 30వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని, ఇంకెన్నో  అముద్రిత, అపరిష్కృత, లికిత పత్రాలు ఉన్నట్లు తెలిపారు. నడిగూడెం కోటలో పరిశోధన కేంద్ర, సభల ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జితేందర్‌ రచించి ప్రచురించిన పలు పుస్తకాలను ఆవిస్కరించారు. చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు శాఖ డైరక్టర్‌ శివనాగిరెడ్డి వ్యాక్యాతగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  ప్రొఫెసర్‌ కేపీ రావు, డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, రేఖాపాండే, దీపక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.logo