శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 19, 2020 , 00:34:38

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి


కోదాడ రూరల్‌ : కారును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ పట్టణ శివారులోని దుర్గపురం సమీపంలో 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన కందరాల ప్రణయతేజ(20), ప్రవీణ్‌, మధు, దామోదర్‌ విజయవాడలో దైవదర్శనానికి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కారులో బయలుదేరారు. కోదాడ పట్టణ శివారులోని దుర్గపురం సమీపంలోకి రాగానే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న టీఎస్‌ ఆర్టీసీ రాజధాని బస్సు కోదాడ పట్టణంలోకి వెళ్లేందుకు టర్నవుతూ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన నలుగురు యువకులను 108లో కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించగా ప్రణయతేజ(20) చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రగాయాలైన ముగ్గురిని హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.

లారీ, కారు ఢీ.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

మోతె : కారును లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని హుస్సేనాబాద్‌ సమీపంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రోటరీనగర్‌కు చెందిన మేల శిరీష(35), నిమ్మల కృష్ణారెడ్డి, అరీష్‌రెడ్డి, డ్రైవర్‌ అశోక్‌ కారులో సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్నారు. హుస్సేనాబాద్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలిస్తుండగా శిరీష మార్గమధ్యలో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. డ్రైవర్‌ ఆశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నికోలాస్‌ తెలిపారు.

కారు, బైక్‌ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు

మర్రిగూడ : కారు, బైకు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని యరుగండ్లపల్లి శివారులో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఖుదాబక్షిపల్లికి చెందిన గోల్కొండ గణేశ్‌ బైక్‌పై మర్రిగూడకు వస్తున్నాడు. ఇందుర్తి గ్రామానికి చెందిన పదం నవీన్‌ కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. యరుగండ్లపల్లి శివారులోకి రాగానే కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో గణేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.


logo