సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 18, 2020 , 04:02:14

వైభవంగా ఖాజా నసీరుద్దీన్‌బాబా గంధోత్సవం

వైభవంగా ఖాజా నసీరుద్దీన్‌బాబా గంధోత్సవం
  • - జనజాతరగా సాగిన ఊరేగింపు
  • - ఆకట్టుకున్న ఫకీరుల విన్యాసాలు
  • - ఘనంగా గంధం ఊరేగింపు

అర్వపల్లి : మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న అర్వపల్లి ఖాజానసీరుద్దీన్‌బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హిందూ, ముస్లింలు బాయీబాయి అంటూ కలిసి పాల్గొనే హజ్రత్‌ ఖాజా నసీరుద్దీన్‌బాబా దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధం ఊరేగింపు ర్యాలీ ఆద్యంతం జనజాతరగా సాగింది. బాబా ఉర్సు ఉత్సవాలను దర్గా ఖాదీమ్‌ ఎం.డీ. మౌలాన ఆధ్వర్యంలో ముజావర్లు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ప్రారంభించారు. ఈ ఉత్సవంలో తొలిరోజు వక్ఫ్‌బోర్డు నుంచి తెచ్చిన గంధాన్ని మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో నూతన కలశాలలో నింపి పూజలు చేసిన అనంతరం దర్గా వరకు నిర్వహించిన గంధోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. మేళతాళాలు మారుమోగుతుండగా, ఫకీరుల విన్యాసాల నడుమ గంధోత్సవాన్ని పోలీస్‌స్టేషన్‌ నుంచి ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్‌లో పవిత్ర గంధం కలశాలను సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు, అర్వపల్లి జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, నాగారం సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ మహేశ్‌ తలపై ఎత్తుకుని పోలీస్‌స్టేషన్‌ నుంచి దర్గా వరకు మోసుకెళ్లారు. ఊరేగింపులో బాబా పవిత్ర గంధాన్ని తాకేందుకు భక్తులు క్యూకట్టారు. దర్గా వరకు మోసుకొచ్చిన పవిత్రగంధాన్ని దర్గాలోని ఖాజానసీరుద్దీన్‌బాబా సమాధిపైకి ఎక్కించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబా సమాధిపై దట్టీలను కప్పి పూలమాలలు వేసి అలంకరించారు.  కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుక, కోఆప్షన్‌ సభ్యుడు ఎం.డీ.హమీద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బైరబోయిన రామలింగయ్య, కనుకు శ్రీను, బొడ్డు రామలింగయ్య, పులిచర్ల ప్రభాకర్‌, తూటిపెల్లి మల్లేశ్‌, బందెల అర్వపల్లి, మామిడాల రాజలింగం, దావుల లింగయ్య, కడారి నరేశ్‌ పాల్గొన్నారు.
logo