సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 17, 2020 , 01:36:10

చారిత్రక వేదికకు ముస్తాబు

 చారిత్రక వేదికకు ముస్తాబునడిగూడెం : మండల కేంద్రంలోని రాజావారికోటలో ఈ నెల 18 నుంచి డెక్కన్ ఆర్కియాలజీ  అండ్ కల్చెరర్ ఇన్ ఆధ్వర్యంలో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ మహాసభలు, పరిశోధన కేంద్రం ప్రారంభం కానున్నట్లు సంస్థ డైరక్టర్ కుర్రా జితేంద్రబాబు తెలిపారు. గురువారం కోటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నడిగూడేనికి చెందిన రాజాగారు( రాజానాయిని వెంకటరంగారావు)1900లో హైదరాబాద్ గ్రంథాలయం స్థాపించి దానికి  శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంగా పేరు పెట్టిన తర్వాత అనేక గ్రంథాలయాలు స్థాపించి తెలంగాణ గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తి రాజాగారు అన్నారు.

ఆయన ఆశాయాలకు అనుగుణంగానే నడిగూడెం రాజాగారి కోటలో తెలంగాణ గ్రంథాలయాలకు బీజం ఏర్పడిన కోటలోనే సభలు ఏర్పాటు చేసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు, అందుకు రాజావారి కుటుంబీకులను సాయం కోరగా వారు అంగీకరించి కోటను తమకు స్వాధీన పర్చినట్లు చెప్పారు. కోటలో 1623 నుంచి సేకరించిన పుస్తకాలు, తాళపత్రగ్రంథాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ కూడా లభ్యం కాని పుస్తకాలు అనేకం ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కోటలో తెలుగు, మరాఠా, కన్నడం, సంస్కృతం, పాలీ, హిందీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన 2.5లక్షల పుస్తకాలు, 30వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయన్నారు.

ఇక్కడ ఉన్న  పుస్తకాలు పఠనం చేసేందుకు ఇతర దేశాల నుంచి పరిశోధన స్కాలర్స్ రానున్నట్లు తెలిపారు. వారికి తగిన వసతి, ఆహారం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కమిటీ సభ్యుల సహకారంతో, దాతల విరాళాలతో కోటలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. 1880లో నిర్మించిన ఈ కోటలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశామని, ప్రారంభ వేడుకలు 18, 19తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్ జయకిషన్, ఎల్.రామానాయుడు, స్థానిక సెక్రటరీ హిమబిందు, ఖలీల్ పాల్గొన్నారు.logo