మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 15, 2020 , 04:05:39

బరిలో 557మంది అభ్యర్థులు

బరిలో 557మంది అభ్యర్థులునామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఐదు
మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డులకు గాను 557 మంది
అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా 1800 నామినేషన్లు దాఖలు కాగా ఈ
నెల 12 నుంచి 14 వరకు 1243 మంది ఉపసంహరించుకున్నారు. దీంతో
సూర్యాపేటలో 200 మంది, కోదాడ 141, హుజూర్‌నగర్‌ 114, తిరుమలగిరి 45,
నేరేడుచర్ల 57 మంది పోటీలో ఉన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌ మినహా మొత్తం
వార్డులకు ఏ పార్టీ కూడా నామినేషన్లు వేయలేక పోవడం గమనార్హం. టీఆర్‌ఎస్‌
నుంచి భారీగా ఆశావహులు నామినేషన్లు వేసినప్పటికీ మంత్రి జగదీశ్‌రెడ్డి
అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ప్రతిపక్షాల కుట్రలను ఛేదిస్తూ రెబల్‌గా
ఉండాలనుకునే వారిని దాదాపు ఉపసంహరించుకునేలా చేయడంలో
కృతకృతులయ్యారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా ఎన్నికలకు అతి
కొద్ది గడువు మిగిలి ఉండడంతో నేటి నుంచి మైకుల మోతలతో
 ప్రచారాలు మొదలుకానున్నాయి.

-సూర్యాపేట 200, కోదాడ 141, హుజూర్‌నగర్‌ 114, తిరుమలగిరి 45, నేరేడుచర్లలో 57మంది
-మూడు రోజుల్లో ఉపసంహరణలు 1243
-  తిరుగుబాటుదారులను దారిలోకి తెచ్చిన మంత్రి
-  నేటి నుంచి మైకుల మోత షురూ


సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజు నుంచి అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొని ఉండగా ఎట్టకేలకు అంతా సమసిపోయింది. నేడు టిక్కెట్‌ దక్కిన వారు సంతోషంగా ఉండగా ఆశించి భంగపడ్డ వారు కాస్తంత ఆగ్రహం, ఆవేదన, అలకలతో ఉన్నారు. ఈ తంతు అధికార టీఆర్‌ఎస్‌లో కొంతమేర అధికంగా ఉండగా ప్రతిపక్షాలకు మాత్రం అసలు సరిపడా అభ్యర్థులు లేకపోవడంతో ఎక్కడికక్కడ ఆయా పార్టీలు పొత్తులు పెట్టుకొని ఎట్టకేలకు అన్ని వార్డుల్లో అభ్యర్థులను పెట్టుకొని తలనొప్పి లేకుండానే నామినేషన్ల ఉపసంహరణలు ముగిశాయి. అయితే మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రతి స్టేజ్‌లో అందరికీ సలహాలు, సూచనలు ఇస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉపసంహరణలు ముగిసేలా చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణల కోసం ప్రత్యేక కమిటీలు వేసి ఆశావహులతో మాట్లాడించగా తప్పని పరిస్థితుల్లో కొద్దిమందితో నేరుగా మంత్రి మాట్లాడడం, సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీలు ఇవ్వడంతో ఉపసంహరణలు దాదాపు 98శాతం జరిగాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగియడం, ఈనెల 22న పోలింగ్‌ ఉండడంతో ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిన అభ్యర్థులు నేటి నుంచి ప్రచారం ఉధృతం  చేసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. అందుకు కావాల్సిన సరుకు, సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. logo