గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jan 15, 2020 , 04:01:41

కమనీయం ..రమణీయం

కమనీయం ..రమణీయం
  • - అంగరంగ వైభవంగా గోదాదేవి శ్రీనివాసుల కల్యాణం
  • - ‘పేట’లో 1500మంది దంపతులతో వైభవంగా వేడుక
  • - భక్తజన సందోహం నడుమ కిక్కిరిసిన దేవాలయాలు
  • - అద్భుతక్షేత్రంగా వేంకటేశ్వర ఆలయాన్ని తీర్చిదిద్దుకుందాం
  • - విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • - ఆద్యంతం తిలకించిన మంత్రి దంపతులు

సూర్యాపేట టౌన్‌ : జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాల్లో భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, గోదాదేవి సమేత శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని మంగళవారం కనుల పండుగలా నిర్వహించారు. వేంకటేశ్వరాలయంలో నిర్వహించిన వేడుకకు సుమారు 1500 మంది దంపతులు పాల్గొనడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపం వద్ద, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ముందు భాగంలో మండపం వద్ద కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు.  కల్యాణ మహోత్సవానికి విద్యుత్‌ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సతీసమేతంగా హాజరై కల్యాణ వేడుకను ఆద్యంతం తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల అభివృద్ధితోపాటు ఆలయాలన్నీ నూతన వైభవాన్ని సంతరించుకుంటున్నాయన్నారు. అదే మార్గంలో జిల్లా కేంద్రంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన శ్రీ వేంకటేశ్వరాలయాన్ని అద్భుతక్షేత్రంగా తీర్చిదిద్దుకుందామన్నారు. కార్యక్రమానికి ముందు పేటలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సతీమణి గుంటకండ్ల సునీతతో కలిసి స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు ఊరేగింపుగా దేవాలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులకు వేద పండితులు సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయ ప్రధానార్చకులు నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు, నల్లాన్‌ చక్రవర్తుల మురళీధరాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణవేడుకను కనులపండువగా 

నిర్వహించారు. కల్యాణోత్సవానికి పట్టణంలోని భక్తులు భారీ సంఖ్యలో హాజరై తిలకించారు. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవితో అవతార పురుషుడు శ్రీనివాసుడి కల్యాణోత్సవాన్ని పంచరత్ర ఆగమశాస్త్ర రీతిలో వేదమంత్రాలు, మంగళ వాయి  ద్యాల నడుమ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలు, 

 పట్టు వస్ర్తాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించబడిన గోదాదేవి, శ్రీనివాసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఆసీనులను చేశారు. స్వస్థివాచనం, అనంతరం విస్వక్సేన పూజతో కల్యాణతంతు ప్రారంభించారు. గోదాదేవి మెడలో శ్రీనివాసుడు, భూదేవి మెడలో వెంకటేశ్వరస్వామి మంగళసూత్రధారణ గావించారు. అనంతరం చిన్నారుల నృత్యాలు అలరించాయి. కల్యాణ వేడుకల్లో జిల్లావ్యాప్తంగా 1500మంది దంపతులు, సుమారు 7వేల మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. భక్తిగీతాలకు కోలాట నృత్య ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులందరికీ తదియారాధన నిర్వహించారు.  ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌-నాగమణి దంపతులు, గుంటకండ్ల మేఘన, టీఆర్‌ఎస్‌ నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి, తిప్పని సుధీర్‌రెడ్డి, ఎం.అనిల్‌రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు, ఆండాల్‌ గోష్టి, వికాస తరంగిణి, మహిళా బృందాలు అర్చకులు పాల్గొన్నారు. 
logo