మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 14, 2020 , 03:38:58

మున్సిపల్‌ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

మున్సిపల్‌ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
  • - రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి

సూర్యాపేట, నమస్తేతెలంగాణ : ఈనెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నాగిరెడ్డి సూచించారు. సోమవారం జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్‌ సెక్రటరీ అశోక్‌కుమార్‌, సంచాలకులు శ్రీదేవితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు పటిష్టంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎంసీసీ పాత్ర కీలకమని, నియమించిన బృందాలు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణలో ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు సూచించిన విధంగా నియమావళి ప్రకారం ఉండాలని, బ్యాలెట్‌ పేపర్ల నమూనాను ఆర్‌ఓలు తప్పకుండా పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం ఎన్నికల విధివిధానాలపై అసిస్టెంట్‌ సెక్రటరీ అశోక్‌కుమార్‌, సంచాలకులు శ్రీదేవి వివరించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో జరిగే ఎన్నికలను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అలాగే వెబ్‌కాస్టింగ్‌, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నట్లు చెప్పారు.  ఇప్పటికే నియమించిన అన్ని బృందాలు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా  నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు సంబంధిత మున్సిపాల్టీల్లో ఫారం-12ను పూర్తిచేసి తమ ఆర్డర్‌ కాపీని జతచేసి 16వ తేదీ వరకు సమర్పించాలన్నారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఆయా మున్సిపాల్టీల్లో రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలతోపాటు ఎన్నికల ఓట్ల లెక్కింపును సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలను వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ఆ బాధ్యతలను స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌కు అప్పగించినట్లు కలెక్టర్‌ వివరించారు.  


logo