బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 13, 2020 , 04:18:59

ఎన్నికలేవైనా.. ‘కారు’దే గెలుపు

ఎన్నికలేవైనా.. ‘కారు’దే గెలుపు
  • - వరుస విజయాలతో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌
  • - అసెంబ్లీ, స్థానికం, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో గులాబీ జోరు
  • - మున్సిపల్‌ ఎన్నికల్లోనూ క్లీన్‌ స్వీప్‌ లక్ష్యంగా ముందుకు

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికలేవైనా ప్రజలు కారు గుర్తును వెతుక్కొని ఓట్లు వేస్తున్నారు. ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను దత్తత తీసుకున్న చందంగా అన్నివిధాలా ఆదుకుంటుండడంతో జనం సైతం టీఆర్‌ఎస్‌ను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టిస్తోంది. పక్కా ప్రణాళికలతో శ్రేణులను అప్రమత్తం చేస్తూ ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో ప్రజామోదం ఉన్నవారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటూ తనమార్కును చూపిస్తున్నారు. వెరసి ఒకప్పుడు జిల్లాలో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్‌ నేడు కునారిల్లిపోయింది. వరుస ఎన్నికల్లో విజయాలతో జోష్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌ ఇక మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

సూర్యాపేట జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్టులు.. తదనంతరం కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు కొద్ది సంవత్సరాల చొప్పున కంచుకోటలుగా ఉండేవి. కానీ నేడు వీటి పరిస్థితి అత్యంత దయనీయంగా మారి నాయకులు కాదు, కార్యకర్తలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఇక కమ్యూనిస్టులు దాదాపు కనుమరుగు కాగా తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లు లేకుండా పోయింది. 2009లో జిల్లా పరిధిలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌ నాలుగు నియోజకవర్గాలకుగాను తుంగతుర్తిలో టీడీపీ విజయం సాధించగా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. అదే స్థాయిలో స్థానిక సంస్థల ఫలితాలు కూడా ఉన్నాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో అదే ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట, తుంగతుర్తి టీఆర్‌ఎస్‌కు దక్కగా కోదాడ, హుజూర్‌నగర్‌లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మళ్లీ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడల్లో టీఆర్‌ఎస్‌ విజయానంతరం హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సైతం గులాబీ జయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికలకు ముందు జరిగిన 475 పంచాయతీ ఎన్నికలకు దాదాపు 90శాతానికి పైనే సర్పంచులు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అనంతరం జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో మొత్తం 23 జడ్పీటీసీ స్థానాలకుగాను 19 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా కేవలం 3 జడ్పీలు మాత్రం కాంగ్రెస్‌కు దక్కాయి. దీంతో జడ్పీ పీఠంపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. అలాగే 235 ఎంపీటీసీలకు గాను 143 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌కు దక్కగా మిగిలిన చోట్ల కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు గెలిచారు. మొత్తం 23 ఎంపీపీలకుగాను 19 మండలాల్లో ఎంపీపీలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కేవలం నాలుగు మండలాలు మాత్రం కాంగ్రెస్‌ గెలుపొందింది.

ఇక మిగిలింది మున్సిపాలిటీలే..

ఇలా వరుసగా ఏ ఎన్నికల్లోనైనా గులాబీ ప్రభంజనం సృష్టిస్తుండగా ఇక మిగిలింది మున్సిపాలిటీలేనని, జిల్లాలోని ఐదింటిని భారీ మెజారిటీతో గెలిచి తీరుతామని టీఆర్‌ఎస్‌ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరో పక్క ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇవేం ఎన్నికలురా బాబోయ్‌... రోజురోజుకు ప్రజలకు దూరం అవుతున్నామని మదన పడుతున్నారు. ఎన్నికలంటేనే ఓటమి ఖాయమని, కనీసం అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదని, ఇలా అయితే ఎలా అని భయపడే పరిస్థితి దాపురించిందని కాంగ్రెస్‌ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు సూర్యాపేటలోనే సరిపడా అభ్యర్థులు నామినేషన్లు వేయకపోగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం అన్ని వార్డుల్లో బరిలో నిలవాలని వచ్చిన ఆదేశాలతో ముక్కుమొహం తెలియని అనామకులతో హుటాహుటిన నామినేషన్లు వేయించారు. టీడీపీ అసలే గల్లంతు కాగా ఒకనాటి ప్రజల పార్టీలుగా ఉన్న సీపీఎం, సీపీఐ వామపక్షాలు జిల్లాలోని 141 వార్డులకుగాను సీపీఐ 18, సీపీఎం 23 వార్డులకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.


logo