శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 13, 2020 , 04:16:35

పాఠశాలల్లో పెరటి తోటలు

పాఠశాలల్లో పెరటి తోటలు


సూర్యాపేటఅర్బన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం  కార్యక్రమంలో పల్లెలు, పల్లెల్లోని పాఠశాలలు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా పాఠశాలల్లో పెరటితోటల పెంపకం మరింత శోభను తీసుకురానున్నాయి. విద్యార్థుల్లో బాధ్యతలు పెంచడం, రసాయన, క్రిమిసంహారక ఎరువులు వాడని కూరగాయలు, ఆకుకూరల పెంపకంపై అవగాహన కల్పించడం, మధ్యాహ్న  భోజనంలో పోషక విలువలు ఉన్న కూరగాయలు అందించేందుకు, పాఠశాలలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పాఠశాలలో కిచెన్‌ గార్డెన్లను(పెరటితోటలు)ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అనుకూల పరిస్థితులు ఉన్న ప్రతి పాఠశాలలో పెరటి తోటలను పెంచేలా జిల్లా, మండల విద్యాశాఖాధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిద్ధమవుతున్నారు. తోటల పెంపకానికి సంబంధించి ఇప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

 పెంచే కూరగాయలు

జిల్లాలోని 1023పాఠశాలల్లో అనుకూలంగా ఉన్న అన్ని పాఠశాలల్లో పెరటితోటలను పెంచనున్నారు. వీటిలో ప్రధానంగా మునగ, కరివేపాకు, నిమ్మ, పాలకూర, బచ్చలి, తోటకూర, గోంగూర, చిక్కుడు, బీర, టమాట, బెండ, గోరుచిక్కుడు, వంకాయ, సొరకాయ వంటి కూరగాయల మొక్కలను సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పెంచనున్నారు.

ప్రతి పాఠశాలకు రూ.5వేలు     
పెరటి తోటలు పెంచనున్న ప్రతి పాఠశాలకు విద్యాశాఖ నుంచి రూ.5వేలు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా అధికారులు సేకరించి తోటలకు సంబంధించిన వివరాలు, ఫొటోలను రాష్ట్ర విద్యాశాఖకు అందించడంతో అధికారుల పరిశీలన అనంతరం ప్రోత్సాహం కింద అందించే రూ.5వేలు నేరుగా పాఠశాల అక్కౌంట్‌లో జమ చేస్తారు. 

ప్రతి నెలా నివేదికలు పంపించాలి.. 

పాఠశాలల్లో ప్రతిరోజూ మధ్యాహ్న భోజన హాజరు, విద్యార్థుల హాజరుకు సంబంధించిన వివరాలు అధికారులకు పంపిచాల్సి ఉంటుంది. వాటిలాగే పెరటి తోటలకు సంబంధించిన వివరాలను ప్రతి నెలా నివేదికలు సిద్ధం చేసి నాటిన మొక్కలు, కూరగాయలు, వాటికి సంబంధించిన ఫొటోలను ప్రధానోపాద్యాయులు అందించాల్సి ఉంటుంది.  

అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశాం

 జిల్లాలోని 1023 ప్రభుత్వ పాఠశాలలకు తోటల పెంపు విషయంపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ప్రతి సమావేశంలో ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు అందిస్తున్నాం. పెరటి తోటలు పెంచిన పాఠశాలలకు నేరుగా వారి ఖాతాలో రూ.5వేలు జమ చేస్తాం. పెరటితోటల పెంపుతో పాఠశాలల వాతావరణంలో మార్పు రానున్నది. 
 - రమణ, జిల్లా సెక్టోరియల్‌ అధికారి 


logo